suresh babu: ఆంధ్రా-తెలంగాణ ఉద్యమం సమయంలోనూ సినిమా పరిశ్రమ ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదు: నిర్మాత సురేశ్ బాబు

  • పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పటి నుంచే ఇది రాజకీయాలకు అతీతంగా ఉంటోందన్న సురేశ్ బాబు
  • చంద్రబాబు అరెస్ట్ సున్నితమైన అంశమని వ్యాఖ్య
  • తెలుగు సినిమా పరిశ్రమ రాజకీయాలకు దూరంగా ఉండాలన్న సురేశ్ బాబు
Producer Suresh Babu Reply To Media Questions About Chandrababu Naidu Arrest

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్‌పై ప్రముఖ తెలుగు నిర్మాత సురేశ్ బాబు స్పందించారు. ఓ సినిమా వేడుకలో పాల్గొన్న ఆయనను మీడియా ప్రతినిధి ఒకరు టీడీపీ అధినేత అరెస్ట్‌పై స్పందించాలని అడిగారు. చంద్రబాబు అరెస్టయ్యారని, అయితే ఈ అంశంపై తెలుగు సినీ పరిశ్రమ సరైన విధంగా స్పందించడం లేదనే చర్చ సాగుతోందని, కొంతమంది స్పందించినప్పటికీ, టాలీవుడ్ నుంచి రావాల్సిన స్పందన మాత్రం రావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయని, దీనిపై మీరేం చెబుతారు? అని సదరు విలేకరి ప్రశ్నించారు.

పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పటి నుంచే పరిశ్రమలోని ఎక్కువమంది ప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా ఉంటున్నారని సురేశ్ బాబు చెప్పారు. తమలోనూ కొంతమంది ఏదైనా పార్టీకి మద్దతుగా ఉంటారని, కానీ పరిశ్రమ నుంచి మాత్రం తాము ఎలాంటి ప్రకటన చేయమని స్పష్టం చేశారు. ఇది చాలా సున్నితమైన అంశమన్నారు. ఎవరైనా ఒక నాయకుడిని అభిమానించవచ్చు లేదా అభిమానించకపోవచ్చు.. కానీ అది సొంత అభిప్రాయమన్నారు. ఆంధ్రా-తెలంగాణ ఉద్యమం సమయంలోనూ సినిమా పరిశ్రమ ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదని గుర్తు చేశారు. సినిమా పరిశ్రమ రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిదని సూచించారు.

రాజకీయాలకతీతంగా చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించడం కష్టమంటారా? అని మీడియా ప్రతినిధి తిరిగి ప్రశ్నించారు. తాము రాజకీయ నాయకులం కాదని.. అలాగే మీడియా కూడా కాదన్నారు. తాము కేవలం సినిమాలు చేసేవాళ్లమని, అవే చేసుకోవాలన్నారు. సంబంధిత అంశంపై ఓ ప్రకటన చేయాలని కొంతమంది అడుగుతారని, రాజకీయాల్లో రోజూ ఏదో ఒకటి జరుగుతుంది.. అలాంటి వాటిపై ఏం ప్రకటన చేస్తామన్నారు. తన వరకు వస్తే రాజకీయాలకతీతంగా ఉంటామన్నారు. పరిశ్రమలో రాజకీయాలు ఉండకూడదనేది తన అభిప్రాయమన్నారు. ఓ సమయంలో... ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే మనకు పాలిటిక్స్ ఎందుకు? అంటూ సురేశ్ బాబు ఒకింత అసహనం వ్యక్తం చేశారు.

More Telugu News