Hardeep Singh Nijjar: ముదురుతున్న వివాదం.. కెనడాపై భారత్ గుస్సా!

India rejects canadas allegation of link between indian security agencies at Nijjars killing
  • కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హత్య వెనుక భారత సీక్రెట్ ఏజెంట్లు ఉండొచ్చన్న కెనడా ప్రధాని
  • ఈ హత్యతో భారత్‌కు గల సంబంధంపై దర్యాప్తు చేస్తున్నామంటూ సంచలన వ్యాఖ్య
  • కెనడా తీరుపై మండిపడ్డ భారత్
  • తాము చట్టానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామంటూ విదేశాంగ శాఖ ప్రకటన
కెనడా, భారత్‌ల మధ్య దౌత్య వివాదం ముదురుతోంది. ఇటీవల సర్రీలో (కెనడా) జరిగిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య వెనుక భారత నిఘా సంస్థల హస్తం ఉండొచ్చంటూ కెనడా ప్రభుత్వం ఆరోపించడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవి అసంబద్ధమైన, ప్రేరేపితమైన వ్యాఖ్యలంటూ మండిపడింది. చట్టానికి భారత్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. జూన్ 18న సర్రీ నగరంలోని ఓ గురుద్వారా పరిసరాల్లో ఇద్దరు ఆగంతుకులు నిజ్జార్‌ను కాల్చి చంపిన విషయం తెలిసిందే. 

అంతకుమునుపు, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై అసాధారణ వ్యాఖ్యలు చేశారు. కెనడా పౌరుడైన హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు, భారత నిఘా సంస్థలకు మధ్య ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలో కెనడా భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని పేర్కొన్నారు. జీ20 సమావేశాల సందర్భంగా మోదీతో మాట్లాడినప్పుడు తాను నిజ్జార్ హత్య గురించి ప్రస్తావించానని కూడా ప్రధాని ట్రూడో తెలిపారు.

జీ20 సమావేశాల తరువాత భారత్‌, కెనడా మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా ఖలిస్థానీ వేర్పాటువాదానికి కెనడా కేంద్రంగా మారడంపై ప్రధాని మోదీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం, ట్రూడోతో మోదీ చర్చలు ‘సాధారణమైనవిగా’ అభివర్ణిస్తూ భారత్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇతర దేశాధినేతలతో మాత్రం మోదీ ‘ద్వైపాక్షిక’ చర్చల్లో పాల్గొన్నారని పేర్కొంది. తద్వారా కెనడా ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ భారత్ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీంతో, కెనడా ప్రధాని ప్రపంచదేశాల ముందు బలహీన నేతగా మారారంటూ అక్కడి ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. మరోవైపు, కెనడాలో ప్రధాన ఓటుబ్యాంకుగా మారిన సిక్కులను ఆకట్టుకునేందుకు ట్రూడో శతథా ప్రయత్నిస్తున్నారు.
Hardeep Singh Nijjar
Justin Trudeau
Narendra Modi
Canada
India

More Telugu News