Viral Video: యూనిఫాంలో పోలీస్ జంట అదిరిపోయే ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్.. స్పందించిన సీపీ సీవీ ఆనంద్

Prewedding shoot of Hyderabad cop couple viral on social media
  • పోలీస్ యూనిఫాం, వాహనాలు వాడుకోవడాన్ని తప్పుబట్టిన నెటిజన్లు
  • తమ అనుమతి తీసుకుని ఉంటే బాగుండేదన్న పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
  • మరెవరూ ఇలాంటి పనులు చేయొద్దని హెచ్చరిక
  • పెళ్లికి పిలవకున్నా వెళ్లి దీవించి వస్తానన్న సీపీ
యూనిఫాంలో ఓ పోలీస్ కపుల్ తీయించుకున్న ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇద్దరూ పోలీసులే కావడంతో యూనిఫాంలోనే ప్రీవెడ్డింగ్ షూట్‌లో పాల్గొన్నారు. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. యూనిఫాంను ఇలా వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోవడం నేరమంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఫొటోషూట్ బావుందంటూ మెచ్చుకుంటున్నారు.

ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఎక్స్ వేదికగా స్పందించారు. పెళ్లి చేసుకోబోతున్నామన్న ఆనందంతో ఆ జంట కొంత అతి చేసిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగం చాలా  కష్టంతో కూడుకున్న పని అని, అందులోనూ మహిళలకు మరింత కష్టమన్నారు. ఇద్దరు అధికారులు పెళ్లితో ఒక్కటి కావడం సంతోషించదగ్గ విషయమేనని పేర్కొన్నారు.

ఫొటోషూట్‌లో వారు యూనిఫాం ధరించడాన్ని తాను తప్పుపట్టబోనని, కాకపోతే వారు ముందే అనుమతి తీసుకుని ఉంటే ఇంకా బాగుండేదని అభిప్రాయపడ్డారు. తమ అనుమతి కోరినా తప్పకుండా ఇచ్చి ఉండేవాళ్లమన్నారు. వారు చేసిన పని కొందరికి కోపం తెప్పించి ఉండొచ్చన్నారు. వారు తనను పెళ్లికి ఆహ్వానించకపోయినా వెళ్లి అక్షింతలు వేసి ఆశీర్వదించి వస్తానని పేర్కొన్నారు. అయితే, మరెవరూ ఇలా ముందస్తు అనుమతి తీసుకోకుండా ఇలాంటి పనులు చేయొద్దని హెచ్చరించారు.
Viral Video
Pre Wedding Shoot
Hyderabad Police Couple

More Telugu News