Rahul Gandhi: రాజకీయాల్లో మనం ఎవరిపై పోరాడుతున్నామో మనకు తెలిసుండాలి: రాహుల్ గాంధీ

Rahul Gandhi speech in Hyderabad rally
  • తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి సభ
  • హాజరైన కాంగ్రెస్ జాతీయ నాయకత్వం
  • తెలంగాణలో కాంగ్రెస్ అనేక పార్టీలతో పోరాడుతోందన్న రాహుల్
  • బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసే ఉన్నాయని వెల్లడి
  • తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఏ పార్టీ అడ్డుకోలేదని ధీమా
హైదరాబాదులోని తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభకు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితర జాతీయ స్థాయి నేతలు విచ్చేశారు. ఈ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేక పార్టీలతో పోరాడుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలన్నింటితోనూ పోరాడుతోందని వెల్లడించారు. రాజకీయాల్లో మనం ఎవరిపై పోరాడుతున్నామో మనకు తెలిసుండాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 

పార్టీలుగా చూస్తే బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ వేర్వేరుగానే కనిపిస్తాయి... కానీ, ఇవన్నీ కలిసే ఉన్నాయని స్పష్టం చేశారు. లోక్ సభలో కేంద్రం బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు పలికిందని రాహుల్ ఆరోపించారు. కేసీఆర్ పై బీజేపీ ఎలాంటి కేసులు పెట్టదని, ఎంఐఎం నాయకులపైనా ఎలాంటి కేసులు ఉండవని వివరించారు. 

కేసీఆర్, ఎంఐఎం నేతలను మోదీ తన సొంత మనుషుల్లా భావిస్తారు కాబట్టే వారిపై కేసులు ఉండవని అన్నారు. ఇక్కడి ప్రభుత్వం ఎంత అవినీతి చేసినా సీబీఐ ఇటువైపు తొంగిచూడదని వ్యాఖ్యానించారు. 

ఇక, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీయేనని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని సోనియాగాంధీ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సోనియా ఏం చెబుతారో అది చేసి తీరతారని స్పష్టం చేశారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తీరడం ఖాయమని, మరో 100 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్లిపోతుందని, బీజేపీ, ఎంఐఎం ఎంత ప్రయత్నించినా దీన్ని అడ్డుకోలేవని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. తెలంగాణలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిశ్చయించిందని తెలిపారు.
Rahul Gandhi
Thukkuguda
Congress
Hyderabad
Telangana

More Telugu News