Team India: మొన్న శ్రేయస్​, నిన్న అక్షర్​ పటేల్​.. ప్రపంచ కప్​ ముంగిట భారత జట్టుకు గాయాల బెడద!

  • వెన్నునొప్పితో బాధపడుతున్న శ్రేయస్ అయ్యర్
  • రెండు గాయాలతో ఆసియా కప్ ఫైనల్ కు అక్షర్ దూరం
  • ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, ప్రపంచ కప్‌నకు దూరమయ్యే అవకాశం
Indian team is worried about injuries ahead of the World Cup

సొంతగడ్డపై వచ్చే నెలలో జరిగే వన్డే ప్రపంచ కప్ ముందు భారత జట్టును గాయాలు కలవర పెడుతున్నాయి. గాయం నుంచి కోలుకొని జట్టులోకి తిరిగివచ్చిన మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మళ్లీ వెన్ను నొప్పికి గురయ్యాడు. తాజాగా స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్‌ పటేల్‌ కాలు, ముంజేయి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. దాంతో ఈ ఇద్దరూ ఆస్ట్రేలియాతో ఈ నెల వన్డే సిరీస్‌తో పాటు ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటంపై అనుమానాలు మొదలయ్యాయి. బంగ్లాదేశ్ తో జరిగిన సూపర్‌–4 మ్యాచ్‌లో అక్షర్‌కు కండరాల గాయంతో పాటు బంతి తగిలి ముంజేతికి గాయం అయింది. 

అతను పూర్తి స్థాయిలో కోలుకోవడానికి రెండు నుంచి మూడు వారాలు పట్టే అవకాశం ఉంది. శ్రీలంకతో జరిగే ఆసియా కప్ ఫైనల్ నుంచి అతను వైదొలగ్గా.. వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి చేర్చారు. అక్షర్ గాయాలపై స్పష్టత రావాల్సి ఉంది.  ఒకవేళ కండరంలో చీలిక లేకపోతే రెండు వారాల్లో కోలుకుంటాడు. చీలిక ఏర్పడితే మాత్రం తను కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అతను కోలుకోకపోతే వాషింగ్టన్ సుందర్‌‌ను ప్రపంచ కప్ జట్టులో చేర్చే అవకాశం ఉంది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకోకపోతే ఈ నెల 22 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కు అతని స్థానంలో హైదరాబాదీ తిలక్ వర్మను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News