Komatireddy Venkat Reddy: మేం ఏం చేస్తామో రేపటి సభలో చెబుతాం: కోమటిరెడ్డి

Komatireddy talks about Congress Vijayabheri rally
  • త్వరలో తెలంగాణలో ఎన్నికలు 
  • సెప్టెంబరు 17న హైదరాబాదులో కాంగ్రెస్ విజయభేరి సభ
  • హాజరవుతున్న సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే
  • 6 ప్రధాన హామీలు ఇవ్వనున్న సోనియా!
రేపు (సెప్టెంబరు 17) హైదరాబాదు తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి సభ నిర్వహిస్తోంది. ఈ సభకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే వంటి కాంగ్రెస్ అగ్రనేతలు హాజరవుతారని తెలుస్తోంది. 

మరో రెండు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ కార్యకలాపాలు ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశాలకు హైదరాబాద్ కు వేదికగా ఎంచుకోవడం వెనకున్న కారణం కూడా ఇదే. విజయభేరి సభలో 6 ప్రధాన హామీలను సోనియా గాంధీ ప్రకటించనున్నారు. 

కాగా, ఆదివారం నాడు జరిగే విజయభేరి సభపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. మేం ఏం చేయబోతున్నామో రేపటి సభలో చెబుతామని వెల్లడించారు. తాము చేసేదే చెబుతామని స్పష్టం చేశారు. 

తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని కొనియాడారు. ఆమె హైదరాబాద్ వచ్చారని, ఆమెకు అందరం స్వాగతం పలికినట్టు వివరించారు. తెలంగాణ ప్రజలు రేపటి సభకు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. ఇక, తెలంగాణలో కేసీఆర్ పతనం మొదలైందని, ఎన్ని హామీలు ఇచ్చినా, ఎంత ప్రయత్నించినా కేసీఆర్ పార్టీ ఓటమి నుంచి తప్పించుకోలేదని అన్నారు.
Komatireddy Venkat Reddy
Vijayabheri
Congress
Sonia Gandhi
Rahul Gandhi
Priyanka Gandhi
Mallikarjun Kharge
Hyderabad
Telangana

More Telugu News