Frankfurt: భారతీయుల కోసం ప్రత్యేక వీసా విండోను ఏర్పాటు చేసిన అమెరికా

US consulate sets up special visa window for Indians in Frank furt
  • జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ లో ఏర్పాటు
  • భారత్ లో వేచి ఉండే కాలం ఏడాదికి పైనే
  • దీంతో విదేశీ కాన్సులేట్ల నుంచి దరఖాస్తుకు అవకాశం
ఫ్రాంక్ ఫర్ట్ లోని యూఎస్ కాన్సులేట్ భారతీయుల కోసం నాన్ ఇమ్మిగ్రెంట్స్ వీసాల జారీకి ప్రత్యేక విండోను ఏర్పాటు చేసింది. వేచి ఉండే కాలం కేవలం మూడు రోజులు. బీ1 (బిజినెస్), బీ2 (టూరిస్ట్) వీసాల కోసం ప్రస్తుతం మన దేశంలో 15 నుంచి 20 నెలల పాటు వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. 

హైదరాబాద్ కాన్సులేట్ లో బీ1/బీ2 వీసా ఇంటర్వ్యూల కోసం వేచి ఉండాల్సిన వ్యవధి 441 రోజులుగా ఉంది. చెన్నైలో 486 రోజులు, ఢిల్లీలో 526 రోజులు, ముంబైలో 571 రోజులు, కోల్ కతాలో 607 రోజుల చొప్పున వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఫ్రాంక్ ఫర్ట్ లో కేవలం మూడు రోజుల్లోనే వీసా ఇంటర్వ్యూ పూర్తి చేసుకోవచ్చు. 

భారతీయుల నుంచి పెద్ద సంఖ్యలో వీసా దరఖాస్తులు వస్తుండడంతో వెయిటింగ్ పీరియడ్ గరిష్ఠంగా మూడేళ్లకు పెరిగిపోయింది. దీంతో విదేశాల్లోని తమ కాన్సులేట్ల వద్ద దరఖాస్తు చేసుకునేందుకు భారతీయులకు అమెరికా గతేడాది అవకాశం కల్పించింది. మరోవైపు నాన్ ఇమ్మిగ్రెంట్స్ వీసా ఇంటర్వ్యూల కోసం భారత్ లో తీసుకొచ్చిన పోర్టల్ లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఈ సమస్యల పరిష్కారానికి అమెరికా ఎంబసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. 

ఇంటర్వ్యూ అవసరం లేని పర్యాటక వీసాకు వేచి ఉండే కాలం చాలా తగ్గించామని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. భారత్ లో నాన్ ఇమ్మిగ్రెంట్స్ వీసాలకు సంబంధించి ఇంటర్వ్యూ వేచి ఉండే కాలం కరోనా ముందు నాటి స్థాయికి తగ్గినట్టు చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభమైన నాటి నుంచి 3.3 లక్షల పిటిషన్ ఆధారిత తాత్కాలిక ఉపాధి వీసాలు మంజూరు చేసినట్టు ప్రకటించింది.
Frankfurt
US consulate
consulate
Indians visa

More Telugu News