US Airport: లగేజ్ తనిఖీ చేస్తూ డబ్బు కొట్టేసిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది.. వీడియో ఇదిగో!

US Airport Officers Caught On Camera Stealing Money From Passengers Bags
  • అమెరికాలోని మయామి ఎయిర్ పోర్ట్ లో ఘటన
  • సీసీ కెమెరాలో రికార్డయిన ఉద్యోగుల నిర్వాకం
  • ఇద్దరు ఉద్యోగులను అరెస్టు చేసి విచారిస్తున్న పోలీసులు
విమానాశ్రయాలలో సెక్యూరిటీ చెకింగ్ పకడ్బందీగా జరుగుతుంది.. అమెరికాలో అయితే మరింత నిశితంగా జరుగుతుంటుంది. ప్రయాణికులు తమ లగేజ్ తో పాటు పర్సులు, ఒంటి మీద ఉన్న ఆభరణాలు కూడా తీసి ఓ బాక్స్ లో పెట్టి స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. భద్రతాపరమైన ఏర్పాట్లలో భాగంగా చేసే ఈ తనిఖీల విషయంలో సిబ్బంది కచ్చితంగా ఉంటారు. అనుమానాస్పద వస్తువులను ఎయిర్ పోర్ట్ లోపలికి అనుమతించరు. అయితే, ఈ సెక్యూరిటీ చెకింగ్ దగ్గర విమానాశ్రయ సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శించారు.

ప్రయాణికుల బ్యాగులు, పర్సుల్లో నుంచి నగదుతో పాటు ఇతరత్రా విలువైన వస్తువులను కొట్టేశారు. అమెరికాలోని మయామి ఎయిర్ పోర్టులో చోటుచేసుకుందీ ఘటన. ఉద్యోగుల చేతివాటం అక్కడున్న సీసీకెమెరాల్లో రికార్డు కావడంతో ఎయిర్ పోర్ట్ ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. సదరు ఉద్యోగులు ఇద్దరినీ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఏడాది జూన్ 29న మయామి ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులు తమ లగేజీని సెక్యూరిటీ స్కాన్ కోసం మెషిన్ పై పెట్టగా.. అక్కడ విధుల్లో ఉన్న ట్రాన్స్ పోర్ట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (టీఎస్ఏ) ఉద్యోగులు జోసూ గోంజాలెజ్, లాబరియస్ విలియమ్స్ వాటిని స్కానింగ్ మెషిన్ లోకి పంపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడి లగేజీలో ఉన్న పర్సులో నుంచి 600 డాలర్లను గోంజాలెజ్, మరో ప్రయాణికుడి లగేజీలో నుంచి విలియమ్స్ నగదును కొట్టేశారు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను పరిశీలించగా ఈ దొంగతనం బయటపడింది.

దీంతో గోంజాలెజ్, విలియమ్స్ ను జులైలో పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించగా.. డ్యూటీలో ఉన్నప్పుడు ఇలా దొంగతనానికి పాల్పడుతున్నట్లు నిందితులు ఇద్దరూ అంగీకరించారు. ఇద్దరూ కలిసి రోజుకు సగటున వెయ్యి డాలర్ల దాకా కాజేస్తున్నట్లు ఒప్పుకున్నారు. ఈ చోరీలకు సంబంధించి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
US Airport
Stealing Money
Passengers Bags
Caught On Camera

More Telugu News