Indian Air Force: వాయుసేన అమ్ములపొదిలోకి సీ–295

Indian Air Force takes delivery of first C295 aircraft from Airbus in Spain
  • మొదటి విమానాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ కు అప్పగించిన స్పెయిన్
  • మొత్తం 56 విమానాల కొనుగోలుకు భారత్ ఒప్పందం
  • 16 విమానాలు స్పెయిన్లో.. మిగతా 40 వడోదరలో తయారీ
భారత వాయుసేన అమ్ముల పొదిలో కొత్త యుద్ధ విమానాలు వచ్చి చేరనున్నాయి. తొలి విమానం శుక్రవారం స్పెయిన్ నుంచి మన దేశానికి చేరుకోనుంది. ఈమేరకు బుధవారం స్పెయిన్ లోని సెవెల్లేలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌధురి తొలి సీ–295 విమానాన్ని స్పెయిన్ అధికారుల నుంచి అందుకున్నారు. అందులో కాసేపు ప్రయాణించి విమానం పనితీరును పరీక్షించిన చౌధురి మాట్లాడుతూ.. సీ–295 యుద్ధ విమానాల కొనుగోలుకు స్పెయిన్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. మొత్తం 56 విమానాలకు రూ.22 వేల కోట్లతో డీల్ కుదిరిందని, ఇందులో 16 విమానాలను 2025లోగా స్పెయిన్ తయారు చేసి ఇస్తుందని వివరించారు.

మిగతా 40 యుద్ధ విమానాలను గుజరాత్ లోని వడోదరలో తయారు చేయడానికి టీఏఎస్ఎల్ కంపెనీతో స్పెయిన్ కంపెనీ డీల్ కుదుర్చుకుందని తెలిపారు. కాగా, వడోదరలో 2024 నవంబర్ లో ఈ విమానాల తయారీ ప్రారంభం కానుందని తెలిపారు. సీ–295 యుద్ధ విమానం చేరికతో భారత వాయుసేన మరింత పటిష్ఠం అవుతుందన్నారు. ఈ విమానంలో ఒకేసారి 71 మంది జవాన్లను లేదంటే 50 మంది పారాట్రూపర్లను సరిహద్దులకు తరలించవచ్చని వివరించారు. వాయుసేన చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని ఎయిర్ చీఫ్ మార్షల్ అభిప్రాయపడ్డారు. సీ–295 విమానం శుక్రవారం స్పెయిన్ నుంచి ఇండియాకు బయలుదేరనుందని చెప్పారు.
Indian Air Force
C-295
aircraft
Airbus
Spain
air chief marshal

More Telugu News