IRCTC: కాశీ, అయోధ్య చుట్టిరావడానికి పది రోజుల టూర్

IRCTC Tourism Announces Punya Kshetra Yatra Package For Pilgrims
  • కొత్త ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్ సీటీసీ
  • రూ.16 వేలతో ఆరు పుణ్యక్షేత్రాల దర్శనం
  • స్లీపర్ క్లాస్ ప్రయాణంతో పాటు భోజన ఏర్పాట్లు
  • అక్టోబర్ 12 న సికింద్రాబాద్ నుంచి ప్రారంభం
పుణ్యక్షేత్రాలను చుట్టి వచ్చేందుకు ఐఆర్ సీటీసీ మరో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. పది రోజుల పాటు సాగే ఈ కొత్త టూర్ లో కాశీ, అయోధ్య, పూరీ సహా ఆరు ప్రఖ్యాత ఆలయాలను సందర్శించవచ్చని చెబుతోంది. స్లీపర్ క్లాస్ ప్రయాణం, భోజనం, బస ఏర్పాట్లకు కేవలం రూ.16 వేలతో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం భారత్ గౌరవ్ టూరిస్ట్స్ ట్రైన్ లను నడుపుతోంది. ఈ ట్రైన్ లో స్లీపర్‌, సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ క్లాస్‌లలో ప్రయాణించే వీలుంది. అక్టోబర్ 12న సికింద్రాబాద్ నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు.

ఈ ప్యాకేజీలో భాగంగా ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజన (శాకాహారం మాత్రమే) సదుపాయాలతో పాటు ప్రయాణ బీమా, టూర్ ఎస్కార్ట్స్ ను అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు. అయితే, ఆలయాల్లో దర్శన టికెట్లు, పార్కులు, బీచ్ లలో ఇతర ఖర్చులు, ఎంట్రీ టికెట్ ఖర్చులు యాత్రికులే భరించాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో చూడాలని సూచించారు.

యాత్ర వివరాలు..
పూరి-కాశీ-అయోధ్య(ఎస్‌సీజెడ్‌బీజీ-14) యాత్ర అక్టోబర్ 12న సికింద్రాబాద్ నుంచి ప్రారంభం కానుంది. తొమ్మిది రాత్రులు 10 పగళ్లు కొనసాగే ఈ యాత్రలో 716 మందికి మాత్రమే అవకాశం ఉంది. సికింద్రాబాద్ నుంచి పూరి, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్ రాజ్ చేరుకుంటుంది. అక్కడి నుంచి తిరిగి సికింద్రాబాద్ కు చేరడంతో టూర్ ముగుస్తుంది.

సందర్శించే ఆలయాలివే..
పూరిలోని జగన్నాథ దేవాలయం, కోణార్క్ లోని సూర్య దేవాలయం, గయలోని విష్ణుపాద ఆలయం, వారణాసిలోని విశ్వనాథ ఆలయం, విశాలాక్షి, అన్నపూర్ణ దేవి ఆలయాలు, అయోధ్యలోని రామజన్మభూమి, హనుమాన్ గర్హి, ప్రయాగరాజ్ లో త్రివేణి సంగమం.

ప్యాకేజీ ధరలు..
స్లీపర్ క్లాస్ ప్రయాణం, నాన్ ఏసీ హోటల్ గదిలో డబుల్ షేరింగ్ వసతితో కూడిన ప్యాకేజీకి రూ.16,400.. పిల్లలకు (5 నుంచి 11 ఏళ్లు) రూ.15,200
థర్డ్ ఏసీ ప్రయాణంతో పాటు నాన్ ఏసీ హోటల్ గదిలో డబుల్ షేరింగ్ వసతితో కూడిన ప్యాకేజీకి రూ.25,500.. పిల్లలకు (5 నుంచి 11 ఏళ్లు) రూ.24,200
సెకండ్ ఏసీ క్లాస్ ప్రయాణంతో పాటు ఏసీ హోటల్ గదిలో డబుల్ షేరింగ్ వసతితో కూడిన ప్యాకేజీకి రూ.33,300.. పిల్లలకు (5 నుంచి 11 ఏళ్లు) రూ.31,700
IRCTC
Tourism
Punya Kshetra Yatra
spl Package
varanasi
ayodhya
puri

More Telugu News