Chikoti: బీజేపీలో చేరిక వాయిదా పడడంపై చీకోటి ప్రవీణ్ స్పందన.. వీడియో ఇదిగో!

Chikoti Praveen Reaction On Bjp Joining Postphonement
  • ఇప్పుడు నవ్వుతున్న వారికి తానేంటో చూపిస్తానని సవాల్
  • తన అభిమానులంతా నిరుత్సాహపడ్డారన్న చీకోటి
  • నిన్నటి సంఘటనతో తన బలం ఇంకా పెరిగిందని వ్యాఖ్య
భారతీయ జనతా పార్టీలో చేరేందుకు క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ చేసిన ప్రయత్నం చివరి నిమిషంలో వాయిదా పడింది. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం చీకోటి తన అనుచరులతో కలిసి సంతోష్ నగర్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్‌కు చేరుకున్నారు. అయితే అప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. చాలాసేపు వేచి చూసినా కిషన్ రెడ్డి రాకపోవడంతో బీజేపీ కార్యాలయం నుంచి చీకోటి వెనుదిరిగారు. ఈ విషయంపై ఆయన తాజాగా స్పందించారు. తన అభిమానులు, అనుచరులను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశం పోస్టు చేశారు.

బీజేపీలో తన చేరికను అడ్డుకున్న వారికి ఈ వీడియోలో గట్టి హెచ్చరికలు చేశారు. మంగళవారం నాడు జరిగిన పరిణామాలతో తన అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారని చీకోటి చెప్పారు. అయితే, ఇదీ ఒకందుకు మంచిదేనని, ఈ ఘటనతో మన సత్తా అందరికీ తెలిసిందని అన్నారు. తన బలం మరింత పెరిగిందన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన తన అభిమానులను చూసి సంతోషంగా ఫీలయ్యానని చెప్పారు. మిగతా వారు డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటుంటే తన అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చారని అన్నారు. అయితే, పార్టీలో చేరిక వాయిదా పడడంతో వారంతా నిరుత్సాహానికి గురయ్యారని, తాను మాత్రం నిరుత్సాహపడలేదని చెప్పారు.

తనను అడ్డుకున్న వారికి తప్పకుండా సమాధానం చెబుతానని, రాబోయే రోజుల్లో మరింత దృఢంగా వస్తానని అన్నారు. జరిగిన ఘటనలతో ఎవరూ నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని అభిమానులకు సర్ది చెప్పారు. అభిమానుల కోసం తాను 24 గంటలూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. చీకోటి గుండె పెద్దదని, ఏ శక్తులు ఏంచేసినా తనను ఏం చేయలేరని అన్నారు. వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియదని చీకోటి వివరించారు. మీ రాజకీయం మీరు చేయండి.. నేనంటే ఏంటో మీకు చూపిస్తా అంటూ తన ప్రత్యర్థులను ఆయన హెచ్చరించారు.

Chikoti
Bjp Joining
Postphoned
Chikoti Reaction
Viral Videos

More Telugu News