Nadendla Manohar: గుంటూరు మేయర్‌పై నాదెండ్ల మనోహర్ ఆగ్రహం

Nadendla Manohar fires at Guntur Mayor
  • మేయర్ ప్రవర్తన సభ్యసమాజం తలదించుకునేలా ఉందని వ్యాఖ్య
  • జనసేన ఎప్పుడూ హింసను ప్రోత్సహించదన్న నాదెండ్ల
  • పోలీసులు కేసు నమోదు చేయకుంటే కంటెప్ట్ ఆఫ్ కోర్ట్ కింద పోలీసులే బాధ్యులవుతారని వ్యాఖ్య

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ నిన్న ఏపీవ్యాప్తంగా జరిగిన బంద్‌లో జనసేన కూడా పాల్గొందని, ఈ సమయంలో బాధ్యతగల ప్రజాప్రతినిధిగా ఉన్న గుంటూరు మేయర్ కావటి మనోహర్ కావాలని రెచ్చగొట్టేలా వ్యవహరించారని, తమ పార్టీ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మేయర్ ప్రవర్తన సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు. రూల్ ఆఫ్ లా అందరికీ సమానమన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొంతమంది ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

జనసేన పార్టీ ఎప్పుడూ హింసను ప్రోత్సహించదని, అలాంటివాటిలో పాల్గొనదని చెప్పారు. మేయర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామని, అయినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. నగర మేయర్ మళ్లీ మళ్లీ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. గుంటూరు మేయర్‌పై జిల్లా ఎస్పీ వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు కనుక కేసు నమోదు చేయకుంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద పోలీసులు బాధ్యులు అవుతారన్నారు. దీని గురించి తాము సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు.

మేయర్ ఇష్టారీతిన మాట్లాడుతుంటే సమర్థిస్తే ఎలా? అని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ఏదైనా పొరపాటు చేసినా అధికార యంత్రాంగం మద్దతుగా ఉంటుందని ప్రజలు భావిస్తారని, కానీ ఓ వ్యక్తిని వెనకేసుకు రావడం ఏమిటన్నారు. మేయర్ మాట్లాడిన మాటలు కనీసం ఆయన కుటుంబ సభ్యులు హర్షిస్తారా? అని ప్రశ్నించారు. కుట్ర, కుళ్లు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. మరోవైపు, మేయర్ వెంటనే క్షమాపణ చెప్పాలని జనసేన డిమాండ్ చేసింది. లేదంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించింది. దీంతో జనసేన పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

  • Loading...

More Telugu News