Justin Trudeau: కెనడా ప్రధానికి ఇక్కట్లు.. ఇప్పటికీ భారత్‌లోనే ఉంటున్న వైనం

  • విమానంలో సాంకేతిక లోపం 
  • భారత్‌లోనే ఉండిపోయిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో
  • రిపేర్‌కు అవసరమైన విడి భాగాలతో పాటూ మరో విమానం నేడు భారత్‌కు రాక
  • ఈ సాయంత్రం స్వదేశానికి బయలుదేరే అవకాశం
Justin Trudeau Still In India Backup Plane En Route After Jet Trouble

జీ20 శిఖరాగ్ర సమావేశం ముగిసినా కెనడా ప్రధాని మాత్రం భారత్‌లోనే కొనసాగుతున్నారు. సమావేశాల తరువాత కెనడాకు తిరిగి వెళ్లేందుకు సిద్ధమైన ప్రధానికి విమానంలో సాంకేతిక సమస్య రూపంలో అవాంతరం ఎదురైన విషయం తెలిసిందే. విమానం రిపేర్‌కు సమయం పడుతుండటంతో ఆయన భారత్‌లోనే కొనసాగాల్సి వస్తోంది.

ప్రస్తుతం విమానానికి సంబంధించి విడి భాగాలతో పాటూ మరో విమానం కూడా ఇండియాకు వస్తోందని కెనడా వర్గాలు తెలిపాయి. ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం ప్రధాని ట్రూడో స్వదేశానికి బయలుదేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధానిని వీలైనంత త్వరగా స్వదేశానికి చేర్చేందుకు కెనడా మిలిటరీ ప్రయత్నిస్తోందని ప్రధాని కార్యాలయం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. 

మునుపటి భారత పర్యటనలోనూ కెనడా ప్రధానికి ఇబ్బందులు తప్పలేదు. ఆ సమయంలో కెనడా ప్రధాని ఏర్పాటు చేసిన ఓ విందులో భారత వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టే వ్యక్తి అతిథిగా హాజరవడం ఆయనకు దౌత్యపరమైన చిక్కులు తెచ్చిపెట్టింది. ఈ మారు జీ20 సమావేశాల్లోనూ భారత్ కెనడా విషయంలో కాస్తంత కఠినంగానే వ్యవహరించింది. కెనడాతో భారత్ ఎటువంటి అధికారిక ద్వైపాక్షిక సమావేశం నిర్వహించలేదు. ఇది చాలదన్నట్టు, ట్రూడోతో వ్యక్తిగతంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. కెనడా వేదికగా భారత వ్యతిరేక కార్యకలాపాలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది.

More Telugu News