Chandrababu: పురందేశ్వరి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ అందుకే చంద్రబాబుకు మద్దతిస్తున్నారు: కొడాలి నాని

Kodali Nani reveals why Balakrishna and Pawan Kalyan supporting to chandrababu
  • చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారన్న కొడాలి నాని
  • పాలు, పెరుగు, పిడకలు అమ్మే చంద్రబాబుకు వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్న
  • చంద్రబాబుకు వారు మద్దతివ్వడం విడ్డూరంగా ఉందన్న మాజీ మంత్రి
  • చంద్రబాబు తమ పేర్లు బయటపెడతారనే మద్దతిస్తున్నట్లుగా ఉందని వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబు ఓ 420 అని, అవినీతి చక్రవర్తి అని స్వర్గీయ ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ఈ అవినీతిలో అడ్డంగా దొరికిపోయారన్నారు. పాలు, పెరుగు, పిడకలు అమ్మే చంద్రబాబుకు వేల కోట్లు, లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. టీడీపీ లేదా చంద్రబాబుకు డప్పు కొట్టేవారు వీటికి సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు దొరికిన దొంగ అన్నారు. తనను అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

రూ.118 కోట్ల వ్యవహారంలో ఐటీ శాఖ నోటీసులపై స్పందించని వాళ్లు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ కాగానే మద్దతుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అవినీతి చక్రవర్తికి పురందేశ్వరి, బాలకృష్ణ వంటి వారు మద్దతివ్వడం విడ్డూరమన్నారు. బాలకృష్ణ ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదన్నారు. లోకేశ్ రాసిచ్చినట్లుగా ఉందన్నారు. చంద్రబాబుతో కలిసి తండ్రి ఎన్టీఆర్‌కు పురందేశ్వరి వెన్నుపోటు పొడిచారన్నారు.

పవన్ కల్యాణ్‌తో పార్టీ పెట్టించిందే చంద్రబాబు అని ఆరోపించారు. టీడీపీ అధినేత పెట్రోల్ కొట్టిస్తేనే పవన్ తన వారాహిని బయటకు తీస్తాడని, ప్యాకేజీ తీసుకునేవాడు మద్దతు పలకడం కాకుండా ఇంకేం మాట్లాడుతారన్నారు. చంద్రబాబు అవినీతిలో వీళ్లందరికీ భాగం ఉందన్నారు. అందుకే దొంగలంతా చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నారన్నారు. లేదంటే తమ పేర్లు ఎక్కడ బయటపెడతాడోననే భయం ఉండి ఉంటుందన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌నే వీరంతా చదువుతున్నారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో పదిమంది అరెస్టయితే కొంతమందికి బెయిల్ వచ్చిందని, ఇంకొంతమంది జైల్లో ఉన్నారన్నారు. ఈ కేసులో చంద్రబాబు మీద విచారణ జరిగిందనీ, అందుకే అరెస్ట్ చేశారన్నారు.
Chandrababu
Kodali Nani
YSRCP
Telugudesam

More Telugu News