Chandrababu: మేం తెచ్చిన ఎయిర్ పోర్టును జగన్ సిగ్గులేకుండా మళ్లీ ప్రారంభించాడు: చంద్రబాబు

  • నంద్యాల జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • నంద్యాల రాజ్ థియేటర్ సెంటర్ లో బహిరంగ సభ
  • ఓర్వకల్లుకు జగన్ పరిశ్రమలు తీసుకురాలేకపోయాడని విమర్శలు
  • నంద్యాల జిల్లాలో పరిశ్రమలను జగన్ తరిమికొట్టాడని వ్యాఖ్యలు
  • తనను తిట్టేవారికి మంత్రి పదవులు ఇచ్చారని వెల్లడి 
Chandrababu take a swipe at CM Jagan

బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యాచరణలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నంద్యాల జిల్లా పర్యటనకు వచ్చారు. నంద్యాల రాజ్ థియేటర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. తాము తీసుకువచ్చిన ఓర్వకల్లు విమానాశ్రయాన్ని జగన్ మళ్లీ ప్రారంభించారని ఆరోపించారు. సిగ్గులేకుండా రంగులు వేసుకున్నారని, తన పేరు తీసేసి జగన్ పేరు వేసుకుని ఎయిర్ పోర్టు ప్రారంభించారని వివరించారు. ఓర్వకల్లుకు పరిశ్రమలు రప్పించలేకపోయారని విమర్శించారు. 

నందికొట్కూరులో సీడ్ హబ్ వస్తే ఉపాధి అవకాశాలు పెరిగేవని అన్నారు. కానీ నంద్యాల జిల్లాలోని పరిశ్రమలను జగన్ తరిమికొట్టారని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ నంద్యాల జిల్లాలో ఒక్క సాగునీటి ప్రాజెక్టునూ కట్టలేదని విమర్శించారు. 

వైసీపీ పాలనలో రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు. టమాటా ధరలు పడిపోవడంతో రైతులు రోడ్లపై పారబోస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదని, కరెంటు చార్జీలు కూడా పెంచేశారని చంద్రబాబు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక కరెంట్ చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు. తనను తిట్టేవారికి మంత్రి పదవులు ఇచ్చారని వెల్లడించారు.

More Telugu News