Tripura: ఉప ఎన్నికలు: ఏడింట 3 సీట్లు గెలిచిన బీజేపీ, బెంగాల్‌లో దీదీ హవా

BJP wins Bageshwar in Uttarakhand and TMC in Bengal
  • ఉత్తరాఖండ్, త్రిపురలలో ఎన్నికలు జరిగిన మూడుస్థానాలు గెలిచిన బీజేపీ
  • ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అభ్యర్థిపై ఎస్పీ అభ్యర్థి ముందంజ
  • పశ్చిమ బెంగాల్‌లో బీజేపీపై స్వల్ప ఆధిక్యంలో టీఎంసీ
ఆరు రాష్ట్రాలలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాలు గెలుచుకుంది. ఉత్తరాఖండ్‌లోని భాగేశ్వర్, ఉత్తరప్రదేశ్ లోని ఘోసీ, కేరళలోని పుత్తుపల్లి, త్రిపురలోని బాక్సానగర్, ధన్‌పుర్, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి, ఝార్ఖండ్‌లోని దుమ్రి అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5న ఉప ఎన్నికలు జరిగాయి.

భాగేశ్వర్ నియోజకవర్గాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి బసంత్ కుమార్‌పై బీజేపీ అభ్యర్థి పార్వతిదాస్ విజయం సాధించారు. త్రిపురలోని రెండు అసెంబ్లీ స్థానాలను కూడా బీజేపీ గెలుచుకుంది. బాక్సానగర్ సీటును బీజేపీ అభ్యర్థి తఫజ్జల్ హోసైన్, ధన్‌పుర్ నుంచి కమలం పార్టీకే చెందిన బిందు దేవ్‌నాథ్ గెలిచారు. బాక్సానగర్‌లో 66 శాతం మంది మైనార్టీ ఓటర్లు ఉండగా బీజేపీకి 34,146 ఓట్లు, సీపీఎం అభ్యర్థికి 3,909 ఓట్లు వచ్చాయి. ఇక్కడి నుంచి బీజేపీ 30వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించడం గమనార్హం. అలాగే ట్రైబల్స్ ఎక్కువగా ఉండే ధన్‌పూర్‌లో కూడా బీజేపీ 18,871 ఓట్ల మెజార్టీతో గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్, తిప్రమోతా పార్టీలు సీపీఎంకు మద్దతిచ్చాయి. కానీ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది.

ధూప్‌గురి నియోజకవర్గంలో టీఎంసీ అభ్యర్థి నిర్మల్ చంద్ర రాయ్ సమీప బీజేపీ అభ్యర్థి తపసి రాయ్‌పై 4వేల ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు. పుత్తుపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి చాందీ ఊమెన్ 37,719 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సీపీఎం అభ్యర్థి జైక్ సీ థామస్ రెండో స్థానంలో నిలిచారు. దుమ్రి నియోజకవర్గం నుంచి జేఎంఎం అభ్యర్థి బేబీ దేవీ ముందంజలో ఉన్నారు. యూపీలో ఎస్పీ అభ్యర్థి సుధాకర్ సింగ్ సమీప బీజేపీ అభ్యర్థి దారాసింగ్ చౌహాన్‌పై 22 వేల ఓట్ల మెజార్టీతో ఉన్నారు.
Tripura
Uttar Pradesh
West Bengal
Uttarakhand
Kerala
Jharkhand
bypoll

More Telugu News