G20 Summit: జీ20 సదస్సు: చైనా ప్రధానితో జోడైబెన్ భేటీ లేనట్టే

US President Joe Biden not planning to meet Chinese Premier Li at G20 Summit
  • లీకియాంగ్ తో భేటీ ప్రణాళిక లేదని అమెరికా స్పష్టీకరణ
  • అన్ని పార్టీలతో కలసి పనిచేసేందుకు సుముఖమన్న చైనా
  • జీ20 సదస్సులో సానుకూల ఫలితానికి కృషి చేస్తామని ప్రకటన
ఢిల్లీలో జరిగే జీ-20 సదస్సుకు హాజరవుతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇదే కార్యక్రమానికి విచ్చేస్తున్న చైనా ప్రధాని లీ కియాంగ్ తో భేటీ అయ్యే అవకాశాలు లేనట్టు తెలుస్తోంది. వాషింగ్టన్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో జో బైడెన్ బయల్దేరిన అనంతరం.. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లీవియన్ మీడియా ప్రతినిధులకు సదస్సు అజెండాపై వివరాలు వెల్లడించారు. 

చైనా ప్రధానితో అధ్యక్షుడు భేటీ అయ్యే ప్రణాళిక ఏదీ లేదని స్పష్టం చేశారు. జీ20 సదస్సు సందర్భంగా చైనా ప్రధాని లీకియాంగ్ తో అధ్యక్షుడు జోబైడెన్ భేటీ అయ్యే ఉద్దేశ్యం లేదని వైట్ హౌస్ ప్రతినిధి సైతం గురువారం రాత్రి ప్రకటించారు. వాస్తవానికి జీ20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రావాల్సి ఉంది. కానీ, ఆయన తన పర్యటనను రద్దు చేసుకుని, ప్రధానిని పంపిస్తున్నారు. జిన్ పింగ్ రాకపోవడం తనను నిరాశకు గురిచేసినట్టు జోబైడెన్ ఇప్పటికే ప్రకటించారు.

మరోవైపు జీ-20 సదస్సుకు విచ్చేసే అన్ని పార్టీలతో కలసి పనిచేసేందుకు చైనా సుముఖంగా ఉందంటూ ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి మావో నింగ్ ప్రకటించారు. అందరితో కలసి జీ20 సదస్సులో సానుకూల ఫలితం తీసుకొచ్చేందుకు పనిచేస్తామని చెప్పారు. ఉక్రెయిన్ తదితర ఎన్నో అంశాలపై ఒప్పందం విషయంలో జాప్యానికి చైనా తీరును తప్పుబడుతూ బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ విమర్శలు చేసిన నేపథ్యంలో చైనా నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం.
G20 Summit
China
Willing to work
US President
Joe Biden
Chinese Premier
no meet

More Telugu News