YS Sharmila: ఎన్నికల వేళ పిట్టలదొర వింతలు అన్నీ ఇన్నీ కావు: షర్మిల

  • సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తిన షర్మిల
  • పాలమూరు ఓట్ల కోసం దొర తొందరపడుతున్నాడని విమర్శలు
  • పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ సర్వనాశనం చేశాడని ఆగ్రహం
  • దక్షిణ తెలంగాణలో డిపాజిట్లు దక్కవన్న సర్వేలతో దొర భయపడుతున్నాడని ఎద్దేవా
Sharmila fires on CM KCR

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తారు. ఎన్నికల వేళ పిట్టలదొర వింతలు అన్నీ ఇన్నీ కావని పేర్కొన్నారు. పాలమూరు ఓట్లు దక్కించుకునేందుకు దొర తొందరపడుతున్నాడని విమర్శించారు. ఇంతవరకు సగం పనులు కూడా జరగని ప్రాజెక్టుకు ప్రారంభోత్సవాలట... ఇంకా పూర్తికాని రిజర్వాయర్లకు పూజలట... కాలువలు తవ్వకుండానే ఊరూరా ఉత్సవాలట... అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

స్వరాష్ట్రంలో ప్రారంభించిన తొలి ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డిని కేసీఆర్ సర్వనాశనం చేశాడని షర్మిల మండిపడ్డారు. "కమీషన్లు ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు కుమ్మరించి పాలమూరుకు శఠగోపం పెట్టాడు. పనులు ఆగడంతో ప్రాజెక్టు మూలనపడగా... ఎన్నికలు వస్తుండడంతో నామమాత్రపు పనులు చేపట్టాడు. తద్వారా ప్రాజెక్టు మొత్తం పూర్తయిందనే భ్రమను సృష్టిస్తున్నాడు. 

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 50 శాతం కూడా జరగలేదు. అంజనాపూర్ మొదటి రిజర్వాయర్ లో 90 శాతం పనులే పూర్తి చేసి ప్రాజెక్టు మొత్తం కట్టినట్టు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. నార్లాపూర్ వద్ద 9 మోటార్లలో ఒక్కటే వాడుకలో ఉంది. భూ నిర్వాసితులకు ఒక్క రూపాయి కూడా సాయం అందలేదు. కాలువలకు భూసేకరణ పూర్తికాలేదు... ఇదీ పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్ చిత్తశుద్ధి! 

తొమ్మిదేళ్లుగా పాలమూరు ప్రజలను మోసం చేసినందుకు నీ సర్కారుకు చేయాల్సింది విజయయాత్ర కాదు పాడెయాత్ర! పాలమూరు గ్రామాల్లో చేయాల్సింది సంబురాలు కాదు... మీ బందిపోట్లకు బడితె పూజలు! వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూ.35 వేల కోట్లతో పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టును, కేసీఆర్ కమీషన్ల కోసం రూ.55 వేల కోట్లకు పెంచినా పూర్తి చేయలేకపోయాడు. 

ఇది పూర్తిగా ఎన్నికల స్టంట్ గానే భావిస్తున్నాం. పాలమూరుపై ప్రేమ మాత్రం కాదు. దక్షిణ తెలంగాణలో డిపాజిట్లు దక్కవన్న సర్వేలతో దొరకు భయం తప్ప, నీళ్లు ఇవ్వాలన్న జ్ఞానం లేదు" అంటూ షర్మిల విమర్శలు గుప్పించారు.

  • Loading...

More Telugu News