Mohan Bhagwat: అసమానతలు ఉన్నంత వరకూ రిజర్వేషన్లు ఉండాల్సిందే: మోహన్ భగవత్

  • దేశంలో ఇప్పటికీ వివక్ష కొనసాగుతోందన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
  • ఇప్పటి తరం వృద్ధులయ్యే లోపే అఖండ్ భారత్ సాధ్యమవుతుందని జోస్యం
  • 1947లో మన నుంచి విడిపోయిన వారిలో తప్పు చేశామన్న భావన ఉందని వ్యాఖ్య
Reservations should continue as long as inequality persists says Mohan Bhagvat

భారత సమాజంలో ఇప్పటికీ నిమ్నవర్గాలపై వివక్ష కొనసాగుతోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. కాబట్టి, అసమానతలు ఉన్నంత వరకూ రిజర్వేషన్లు కొనసాగాలని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇప్పటి తరం వృద్ధాప్యానికి చేరుకునేలోపే అఖండ భారత్ వాస్తవరూపం దాలుస్తుందని కూడా చెప్పారు. 1947లో మన దేశం నుంచి విడిపోయిన వారు ఇప్పుడు తప్పు చేశామన్న భావనలో ఉన్నారని వివరించారు. 

‘‘మన సాటి వారినే మనం వెనక్కు నెట్టేశాం. వారిని పట్టించుకోలేదు. ఇది ఏకంగా 2 వేల ఏళ్ల పాటు సాగింది. వారికి సమానత్వం కల్పించే వరకూ కొన్ని ప్రత్యేక ఉపశమనాలు కల్పించాల్సిందే. రిజర్వేషన్లు ఇందులో భాగమే. రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుంది. 2 వేల ఏళ్ల పాటు కొన్ని వర్గాలు వివక్షను ఎదుర్కొన్నాయి. వారి మేలు కోసం ఓ 200 సంవత్సరాల పాటు మనం చిన్న చిన్న ఇబ్బందులు తట్టుకోలేమా?’’ అని ఆయన వ్యాఖ్యానించారు. మనకు కనిపించకపోయినా సమాజంలో ఇప్పటికీ వివక్ష కొనసాగుతోందని చెప్పారు.

More Telugu News