Ghaziabad: కుక్క కరిచిన విషయం దాచిన బాలుడు.. నెల తర్వాత రేబిస్ తో మృతి

Ghaziabad Teen Hides Dog Bite From Parents Dies Of Rabies A Month Later
  • ఘజియాబాద్ లో దారుణం.. పొరుగింటి వారిపై పోలీస్ కేసు
  • ఢిల్లీలో ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్లినా చేర్చుకోలేదని ఆరోపణ
  • బులంద్ షహర్ ఆయుర్వేద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి
ఇంటి ముందు ఆడుకుంటుండగా పక్కింటి కుక్క కరిచింది.. తల్లిదండ్రులకు తెలిస్తే తిడతారనే భయంతో చెప్పకుండా దాచాడా పిల్లాడు. సమయానికి చికిత్స అందకపోవడంతో రేబిస్ సోకి 45 రోజుల తర్వాత ఆ బాలుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఘజియాబాద్ లో జరిగిందీ దారుణం. పోలీసులు, బాలుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్ లోని చరణ్ సింగ్ కాలనీలో ఉంటున్న షావాజ్ (14) స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. నెలన్నర క్రితం షావాజ్ ను పొరుగింటి వారి పెంపుడు కుక్క కరిచింది. గాయం చిన్నదేనని, తల్లిదండ్రులకు తెలిస్తే కోప్పడతారని షావాజ్ ఈ విషయాన్ని దాచిపెట్టాడు. కుక్క కరిచిన విషయాన్ని పెద్దవాళ్లకు చెప్పలేదు. దీంతో సమయానికి చికిత్స అందలేదు.

రోజులు గడుస్తున్న కొద్దీ షావాజ్ విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నీళ్లను చూస్తే వణికిపోవడంతో పాటు ఈ నెల 1 నుంచి ఆహారం మానేశాడు. ఏం జరిగిందని తల్లిదండ్రులు ఆరా తీయగా.. పక్కింటి వాళ్ల కుక్క కరిచిందని చెప్పాడు. దీంతో వెంటనే షావాజ్ ను వారు ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, పరిస్థితి విషమించిందని వైద్యులు అడ్మిట్ చేసుకోలేదు. గత్యంతరం లేక బులంద్ షహర్ లోని ఓ ఆయుర్వేద ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ షావాజ్ సోమవారం సాయంత్రం కన్నుమూశాడు. షావాజ్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పొరుగింటి వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Ghaziabad
Dog Bite
Dies Of Rabies
Hides From Parents

More Telugu News