Purandeshwari: సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్​ వ్యాఖ్యపై పురందేశ్వరి తీవ్ర ఆగ్రహం

Purandeshwari condemns Udaynidhi Stalin comment on Sanatana Dharma
  • సనాతన ధర్మాన్ని దోమల నిర్మూలన చర్యతో పోల్చడం హేయమన్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు
  • ఇవి  దేశంలోని హిందూ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయన్న పురందేశ్వరి 
  • విపక్షాల కూటమికి ‘ఇండియా’ పేరు పెట్టుకునే నైతిక అర్హత లేదని విమర్శ
సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని దోమల నిర్మూలన చర్యతో పోల్చడం హేయమైన చర్య అని, రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. హిందువుల మనోభావాలను దెబ్బదీసే విధంగా ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలోని నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయినిధిని సమర్ధిస్తూ కార్తి చిదంబరం చేసిన వ్యాఖ్యలనూ పురందేశ్వరి ఖండించారు.  

‘భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి ఉదయనిధి స్టాలిన్, సనాతన ధర్మాన్ని దోమల నిర్మూలన చర్యతో పోల్చి నిర్మూలించాలని తన ఆకాంక్షను వ్యక్తం చేయడం హేయమైన చర్య. ఇది రాజ్యాంగ విరుద్ధం. అదే వేదికపై ఉన్న తమిళనాడులోని హిందూ మతపరమైన, ధర్మాదాయ సంస్థలకు బాధ్యత వహించే పీకే శేఖర్‌బాబు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా మౌనంగా ఉండిపోవడం దేనికి సంకేతం? సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడమే ‘ఇండియా’ కూటమి ఉద్దేశమని కాంగ్రెస్ తమిళనాడు అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ చర్యలు దేశంలోని హిందూ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.  

విపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టుకోవడానికి కనీస నైతిక హక్కు లేదన్నారు. 2010 సంవత్సరంలో హిందూ సంస్ధలను లష్కరే తొయిబా సంస్ధతో రాహుల్ గాంధీ పోల్చిన విషయాన్ని పురందేశ్వరి గుర్తు చేశారు. ఇది చాలా దారుణమని చెప్పారు.
Purandeshwari
Andhra Pradesh
BJP
Udaynidhi Stalin
india
Congress

More Telugu News