ఎల్బీనగర్ ప్రేమోన్మాది కేసులో సంచలన విషయాలు
- కన్న తండ్రిని హతమార్చిన నిందితుడు
- సుత్తితో తలపై కొట్టి చంపేసిన శివకుమార్
- ఇదే ప్రేమ విషయంలో మందలించడంతో దారుణం
- బయటకు పొక్కనివ్వని గ్రామస్తులు
రంగారెడ్డి జిల్లా నేరెళ్లచెరువు గ్రామానికి చెందిన శివకుమార్ ఆదివారం దారుణానికి తెగబడ్డాడు. తన ప్రేమను అంగీకరించలేదని క్లాస్ మేట్ సంఘవిపై దాడికి యత్నించాడు. అడ్డుకున్న సంఘవి సోదరుడు పృథ్వీని కత్తితో పొడిచి చంపాడు. ఆదివారం మధ్యాహ్నం ఎల్బీనగర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని ఫరూక్ నగర్ మండలం నేరెళ్లచెరువు గ్రామానికి చెందిన శివకుమార్.. షాద్ నగర్ లోని స్కూల్ లో తనతో పాటు చదువుకున్న సంఘవిని ప్రేమించాడు. అప్పటి నుంచే సంఘవిని వేధిస్తున్నాడు.
పదో తరగతి తర్వాత సంఘవి కుటుంబం హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లోని అద్దె ఇంట్లోకి మారింది. రామాంతపూర్ లోని హోమియో కాలేజీలో సంఘవి నాలుగో సంవత్సరం చదువుతుండగా.. ఆమె సోదరుడు పృథ్వీ ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. శివకుమార్ డిగ్రీ పూర్తి చేసి రామాంతపూర్ లో ఉంటున్నాడు. ఇటీవల సంఘవిని కలిసి మరోమారు తన ప్రేమ విషయం చెప్పగా.. సంఘవి మందలించినట్లు సమాచారం. దీంతో పగబట్టిన శివకుమార్.. ఆదివారం ఆర్టీసీ కాలనీలోని సంఘవి ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు.