Ambati Rayudu: మూడే మ్యాచులాడి సీపీఎల్ నుంచి వైదొలిగిన రాయుడు.. రాజకీయాలపై ఫోకస్ పెట్టేందుకేనా?

  • అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ కు రిటైర్మెంట్ ఇచ్చిన తెలుగు క్రికెటర్
  • సీపీఎల్ లో సెయింట్‌ కిట్స్‌ జట్టుతో ఒప్పందం
  • మూడు మ్యాచుల్లో  47 పరుగులే చేసిన రాయుడు
Ambati Rayudu leaves Caribbean Premier League due to personal reasons

భారత మాజీ క్రికెటర్‌, తెలుగు ఆటగాడు అంబటి రాయుడు కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్) నుంచి అర్థాంతరంగా వైదొలిగాడు. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు ప్రస్తుత సీజన్‌లోనే తొలిసారిగా తను సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ, మూడు మ్యాచులే ఆడి లీగ్ నుంచి అనూహ్యంగా తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలరీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అతను నిర్వాహకులకు వెల్లడించాడు. ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రాయుడు 47 పరుగులు మాత్రమే చేశాడు. 

అయితే, టోర్నీ నుంచి ఇలా ఉన్నట్టుండి వైదొలగడం వెనుక బలమైన కారణమే ఉండొచ్చని తెలుస్తోంది. రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన రాయుడు ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. అతను వైసీపీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాడని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా సీఎం జగన్ ను కలిసిన రాయుడు ఆయనపై పొడగ్తల వర్షం కురిపించారు. పలు ప్రాంతాల్లోనూ పర్యటించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలపై పూర్తిగా ఫోకస్ పెట్టేందుకే రాయుడు ఇలా సీపీఎల్ నుంచి వైదొలిగినట్టు తెలుస్తోంది.

More Telugu News