Cauvery Water: తమిళనాడుకు కావేరీ జలాలు.. రాత్రంతా ఆందోళన చేసిన కర్ణాటక రైతులు

  • తమిళనాడుకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాాలన్న 'కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ' 
  • తీవ్రంగా నిరసిస్తున్న కర్ణాటక రైతులు
  • సమస్య పరిష్కారం కోసం రేపు ఢిల్లీ వెళ్లనున్న డిప్యూటీ సీఎం శివకుమార్
Karnataka Farmers Protest Over Cauvery Water In Mandya

తమిళనాడు రైతులకు నీటిని విడుదల చేయాలన్న 'కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ' నిర్ణయాన్ని నిరసిస్తూ కొందరు కర్ణాటక రైతులు శ్రీరంగపట్నం సమీపంలోని మాండ్యలో రాత్రంతా నిరసన ప్రదర్శన నిర్వహించారు. కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ ప్రతిపాదనలను అనుసరించి కర్ణాటక ప్రభుత్వం 15 రోజులపాటు తమిళనాడుకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సివుంది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్‌కు మద్దతిస్తున్న స్వతంత్ర ఎమ్మెల్యే దర్శన్ పుట్టనయ్య రైతులకు మద్దతు ప్రకటించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో కావేరీ జలాల సమస్యపై చర్చించేందుకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. 

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం నీళ్లు ఇవ్వలేమని, తమ రిజర్వాయర్లు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని, అదే జరిగితే తాగునీటికి ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. 3 వేల క్యూసెక్కులకు మించి ఇవ్వలేమని శివకుమార్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సమస్య పరిష్కారం కోసం ఆయన ఢిల్లీ పయనమవుతున్నారు. కావేరీ జలాల కోసం కర్ణాటక-తమిళనాడు మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతూనే ఉంది. దీంతో సమస్య పరిష్కారం కోసం 1990లో కేంద్ర ప్రభుత్వం ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసింది.

More Telugu News