TDP: ఇసుక తవ్వకాలపై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు చేసిన టీడీపీ నేతలు

TDP leaders complains on sand mining issue
  • ఇసుక అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ టీడీపీ ఆగ్రహం
  • ఇసుక సత్యాగ్రహం కార్యక్రమానికి పిలుపునిచ్చిన చంద్రబాబు
  • రెండో రోజు కార్యాచరణలో ఫిర్యాదుల పర్వం
  • రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన టీడీపీ శ్రేణులు

ఏపీలో అధికార వైసీపీ నేతలు ఇసుక అక్రమ తవ్వకాలతో కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇసుక అక్రమాలపై పోరాడాలంటూ పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు టీడీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా పోరాటభేరి మోగించారు. 

చంద్రబాబు పిలుపు ఇచ్చిన మేరకు ‘ఇసుక సత్యాగ్రహం’ కార్యక్రమంలో భాగంగా రెండో రోజున తహసీల్దార్ కార్యాలయాల్లో, పోలీస్ స్టేషన్లలో టీడీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. అక్రమంగా ఇసుక తవ్వుతున్న క్వారీలపై, నిర్వాహకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఉచితంగా అందే ఇసుక పాలసీపై నిందలేసి, నానా యాగీ చేసిన జగన్ రెడ్డి... అధికారంలోకి వచ్చాక నూతన ఇసుక పాలసీ పేరుతో రూ.40 వేల కోట్లు దిగమింగాడని టీడీపీ నేతలు విమర్శించారు. జేపీ పవర్ వెంచర్స్ సంస్థను తెరముందుకు తెచ్చి, తెర వెనుక తన అనుయాయులతో ఇసుక మొత్తాన్ని హస్తగతం చేసుకున్నాడని ఆరోపించారు. తన అనుచరులతోనే దగ్గరుండి ఇసుక మాఫియాను నడిపిస్తూ... తన ఖజానా నింపుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

జేపీ సంస్థకు ఇచ్చిన టెండర్ గడువు ముగిసిన తర్వాత కూడా అదే కంపెనీ బిల్లులతో ఇసుక అమ్మకాలు ముమ్మాటికీ కుంభకోణమే అన్నారు. ఇసుక రీచ్‌లో తవ్వకాలు మొదలుకుని స్టాక్ పాయింట్లకు తరలింపు, విక్రయాలు, వంటి వాటిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. 

ఈ కార్యక్రమంలో గుమ్మడి సంధ్యారాణి, కూన రవికుమార్, తెనాలి శ్రావణ్ కుమార్, బి.కె పార్థసారథి, బి.టి నాయుడు, పులివర్తి నాని, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, నియోజకవర్గాల ఇంఛార్జులు, ద్విసభ్య కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News