Komatireddy Venkat Reddy: టిక్కెట్ల కేటాయింపుపై రేవంత్ రెడ్డి ఆ మాట చెప్పారు.. మంచి ఐడియా: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy Venkat Reddy interesting comments on Revanth Reddy
  • బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి.. అవసరమైతే నల్గొండ వదిలేస్తానని వెల్లడి
  • డిక్లరేషన్ హామీ నెరవేర్చకుంటే మా ప్రభుత్వానికి ఎదురు తిరుగుతామన్న ఎంపీ
  • కేసీఆర్ తల నరుక్కున్న తర్వాత మా డిక్లరేషన్ గురించి మాట్లాడాలని సూచన
కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన డిక్లరేషన్‌పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చని పక్షంలో మా ప్రభుత్వానికే మేం ఎదురు తిరుగుతామని, ఎమ్మెల్యేలమందరం రాజీనామా చేస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాము గతంలో కిరణ్ కుమార్ రెడ్డికే ఎదురు తిరిగామని, మేం ఇచ్చిన హామీలు నెరవేర్చని పక్షంలో సొంత ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. తాము కచ్చితంగా డిక్లరేషన్‌ను సక్సెస్ చేస్తామన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు ఐదుగురు ఎస్కార్ట్‌లు ఉన్నారని, అనవసర ఖర్చులు తగ్గించుకుంటే హామీలు నెరవేర్చవచ్చునన్నారు.

మా డిక్లరేషన్ గురించి మాట్లాడే ముందు కేసీఆర్ ఇచ్చిన హామీల గురించి ఆలోచించాలన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పాడని కానీ అలాంటి ఎన్నో హామీలు నెరవేర్చలేదని చెప్పారు. తల నరుక్కుంటాను కానీ మాట తప్పనని అన్నారని, మాట తప్పినందుకు కేసీఆర్ మొదట తల నరుక్కున్న తర్వాత తమ డిక్లరేషన్ గురించి మాట్లాడాలన్నారు. ఇప్పుడు ఆయన ఏమైనా మొండెంతో తిరుగుతున్నాడా? అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లాగా కాకుండా అందరినీ కలుపుకొని తాము ముందుకు సాగుతామన్నారు.

పార్టీ అభ్యర్థుల ప్రకటనపై కోమటిరెడ్డి

జాబితాను ఇప్పుడే షార్ట్ లిస్ట్ చేయవద్దని తాను పీఈసీలో చెప్పానని కోమటిరెడ్డి అన్నారు. జాబితా త్వరలో పూర్తవుతుందన్నారు. మొదటి నుండి పార్టీలో ఉన్నవారికి, ప్రజల్లో ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు. పీఈసీ సభ్యులకు సమయం ఇచ్చి అన్ని అంశాలు తెలుసుకుంటామని, ఆ తర్వాతనే టిక్కెట్ కేటాయింపు ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారని, ఇది మంచి ఐడియా అన్నారు. స్క్రీనింగ్ కమిటీ మెంబర్‌తో ప్రతి పీఈసీ సభ్యుడు మాట్లాడుతారన్నారు. పార్టీలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమనుకుంటే తాను నల్గొండను వదిలేస్తానని చెప్పారు.
Komatireddy Venkat Reddy
Congress

More Telugu News