ntr: రేపటి నుండి అందుబాటులో రూ.100 ఎన్టీఆర్ నాణెం.. ధర ఎంతంటే..!

  • ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా రూ.100 నాణెం విడుదల
  • మార్కెట్ చలామణి కోసం కాదని వెల్లడించిన మింట్ చీఫ్ మేనేజర్
  • రూ.3500 నుండి రూ.4850 మధ్య నాణెం ధర
NTR 100 rupee coin will be available for purchase

ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. కాగా, ఈ స్మారక నాణేం హైదరాబాద్‌లోని మింట్‌లో తయారైంది. దీనికి సంబంధించి మింట్ చీఫ్ మేనేజర్ వీఎన్ఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్ మింట్‌లో తొలిసారి ఓ వ్యక్తి చిత్రంతో నాణేం ముద్రించబడిందన్నారు. అయితే ఇది మార్కెట్‌లో చలామణి కోసం కాదని స్పష్టం చేశారు. తొలి విడతగా 12 వేల స్మారక నాణేలు ముద్రించామని, వీటి ధర రూ.3,500 నుండి రూ.4,850 వరకు ఉందని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా, హైదరాబాద్‌లోని మూడు చోట్ల ఈ నాణేలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. డిమాండ్ మరింత ఉంటే మరిన్ని తయారు చేస్తామన్నారు.

ఇదిలా ఉండగా, ఈ కాయిన్‌ను మంగళవారం ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంచుతారు. ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు.

More Telugu News