Neeraj Chopra: చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం

Neeraj Chopra wins historic World Athletics Championships gold with incredible 8817 throw in javelin final
  • జావెలిన్‌ను 88.17 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం సాధించిన నీరజ్ చోప్రా
  • పాక్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్‌కు రజతం
  • పురుషుల రిలే 4x400 విభాగంలో ఐదో స్థానంలో నిలిచిన భారత జట్టు
  • స్టీపుల్ చేజ్ విభాగంలో 11వ స్థానంలో నిలిచిన భారత క్రీడాకారిణి పరుల్ చౌదరి

ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం అందించిన జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా మరో చరిత్ర సృష్టించాడు. హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో దేశానికి మరో బంగారు పతకం అందించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. 

క్వాలిఫైయర్స్‌లో నీరజ్ ఈటెను 88.77 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌‌లో అడుగుపెట్టాడు. ఆ తరువాత ఫైనల్స్ తొలి ప్రయత్నంలో విఫలమైనా రెండో మారు జావెలిన్‌ను 88.17 మీటర్లు విసిరాడు. ఆ తరువాత వరుసగా 86.32, 84.64, 87.73, 83.98, మీటర్ల దూరానికి విసిరాడు. మరోవైపు నీరజ్ ప్రత్యర్థులు కిషోర్ జెనా 84.77 మీటర్లతో ఐదో స్థానానికి పరిమితం కాగా, డీపీ మను 84.14 మీటర్ల దూరం విసిరి ఆరో స్థానంలో నిలిచాడు. ఈ పోటీల్లో రజతం సాధించిన పాక్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ జావెలిన్‌ను 87.82 మీటర్ల దూరం విసిరాడు. ఈటెను 86.67 మీటర్ల దూరం విసిరిన చెక్ క్రీడాకారుడు జాకబ్ వడ్లెచ్ కాంస్య పతకం సాధించాడు. 

ఇదిలా ఉంటే.. పురుషుల 4x400 మీటర్ల రిలే విభాగంలో భారత బృందం 2.59.92 సెకన్లతో రేసును ముగించి 5వ స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో యూఎస్ఏ జట్టు స్వర్ణం గెలుచుకుంది. మహిళల 3000 స్టీపుల్‌ చెజ్ విభాగంలో భారత క్రీడాకారిణి పరుల్ చౌదరి 11వ స్థానంలో నిలిచింది.

  • Loading...

More Telugu News