Asia Cup: ఆసియా కప్‌లో భారత్–పాక్ మ్యాచ్.. మాటల యుద్ధం మొదలు!

Shadab Khan Responds To Ajit Agarkars Virat Kohli Will Handle Remark
  • పాక్ బౌలింగ్‌ సంగతి విరాట్ చూసుకుంటాడని అజిత్ అగార్కర్ వ్యాఖ్యలు
  • మైదానంలో ఎవరు ఏం చేస్తారన్నదే ముఖ్యమన్న పాక్ ప్లేయర్ షాదాబ్ ఖాన్ 
  • సెప్టెంబర్ 2న ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్
వన్డే ప్రపంచకప్‌నకు ముందు ‘ట్రైలర్‌’ లాంటి‌ ఆసియా కప్‌లో టీమిండియా, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. సెప్టెంబర్ 2న జరగనున్న మ్యాచ్‌ కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పుడే రెండు జట్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలకు పాక్ ఆల్‌రౌడర్ షాదాబ్ ఖాన్‌ కౌంటర్ ఇచ్చాడు.

ఆసియా కప్‌ కోసం టీమిండియా జట్టును ప్రకటించిన సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు అజిత్ అగార్కర్ సమాధానమిచ్చాడు. పటిష్ఠ పాక్ పేస్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించగా.. వాళ్ల సంగతి విరాట్ చూసుకుంటాడని బదులిచ్చాడు. 2022లో జరిగిన టీ20 వరల్డ్‌కప్ లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. దీన్ని ఉద్దేశిస్తూ పరోక్షంగా అగార్కర్ అలా అన్నాడు.

దీనిపై తాజాగా షాదాబ్ ఖాన్ స్పందించాడు. మైదానంలో ఎవరు ఏం చేస్తారన్నది మాత్రమే ముఖ్యమని, మ్యాచ్‌కు ముందు లేదా తర్వాత ఎవరు ఏం మాట్లాడుతారనేది ముఖ్యం కాదని కౌంటర్ ఇచ్చాడు. ‘‘చూడండి.. ఆ రోజు ఏం జరుగుతుందనే దానిపై అంతా ఆధారపడుతుంది. నేను లేదా ఇంకొకరు కావచ్చు.. లేదా అవతలి వైపు వాళ్లు కావచ్చు.. వాళ్లు అనుకున్నది ఏదైనా మాట్లాడవచ్చు. అదంత ముఖ్య కాదు.. మ్యాచ్ మొదలైనప్పుడు మాత్రమే.. ఏం జరుగుతుందన్నది తెలుస్తుంది” అని చెప్పుకొచ్చాడు. 

తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌ తో జరిగిన 3 వన్డేల సిరీస్‌ను పాక్ క్లీన్‌ స్వీప్ చేయడంలో షాదాప్ కీలక పాత్ర పోషించాడు. దీంతో పాకిస్థాన్ టీమ్ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఇదే జోరును ఆసియా కప్‌లో చూపెట్టాలని దాయాది దేశం భావిస్తోంది. ఆగస్టు 30న పాక్, నేపాల్ మ్యాచ్‌తో ఆసియా కప్ మొదలు కానుంది.
Asia Cup
India vs Pakistan
Ajit Agarkar
Shadab Khan
Virat Kohli
Team India

More Telugu News