ISRO: ఇస్రో విజయం వెనుక ఉమ్మడి విశాఖ జిల్లా వాసులు

Combined Visakha district residents hand in Chandrayaan 3 success
  • చంద్రయాన్-3 గ్రాండ్ సక్సెస్
  • ఇస్రో బృందంలో ఐదుగురు మనవాళ్లే!
  • తెలుగు శాస్త్రవేత్తలకు కీలక బాధ్యతలు అప్పగించిన ఇస్రో
చంద్రయాన్-3 సాఫల్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఖాతాలో చారిత్రాత్మక విజయం చేరింది. అయితే, ఇస్రో విజయం వెనుక ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఐదుగురు శాస్త్రజ్ఞులు ఉన్నారు. వారి పేర్లు... మోటమర్రి శ్రీకాంత్, అడ్డూరి రామచంద్ర, కె.రవీంద్ర, కొమ్మనమంచి భరద్వాజ్, ఎస్.స్టీఫెన్. 

వీరిలో మోటమర్రి శ్రీకాంత్ ఇస్రోలో మిషన్ ఆపరేషన్స్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. ఆయన స్వస్థలం విజయనగరం జిల్లా సాలూరు. వారి కుటుంబం ఆ తర్వాత విశాఖకు మారింది. ఆంధ్రా వర్సిటీలో ఎమ్మెస్సీ చేసిన శ్రీకాంత్... మాస్టర్స్ అనంతరం ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. 

ఇక అడ్డూరి రామచంద్ర స్వస్థలం ఉమ్మడి విశాఖ జిల్లా కొత్తకోట. రైతు కుటుంబంలో జన్మించిన రామచంద్ర పాలిటెక్నిక్ చదివి, ఆపై బీటెక్, ఎంటెక్ చేసి... ఇస్రోలో రీసెర్చర్ గా అడుగుపెట్టారు. చంద్రయాన్ లో ల్యాండర్ కు సంబంధించిన అత్యంత ప్రాధాన్యత ఉన్న పేలోడ్స్, డేటా ప్రాసెసింగ్ సాఫ్ట్ వేర్ ప్రోగ్రామింగ్ లో రామచంద్ర కీలక పాత్ర పోషించారు. 

కె.రవీంద్ర విషయానికొస్తే ఇస్రోలో యంగ్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు. రవీంద్ర స్వస్థలం ఉమ్మడి విశాఖ జిల్లా అచ్యుతాపురం. చంద్రయాన్-2లో ఎదురైన వైఫల్యాలను చక్కదిద్దే ఇస్రో బృందంలో రవీంద్ర సభ్యుడు. చిన్న వయసులోనే కీలక బాధ్యతల్లో పాలుపంచుకుటుండడం విశేషం. 

కొమ్మనమంచి భరద్వాజ్ విషయానికొస్తే, ఇస్రోలో సీ-గ్రేడ్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన తండ్రి వెంకట్రావు న్యాయవాది. రెండేళ్ల కిందటే శ్రీహరికోట షార్ కేంద్రంలో విధుల్లో చేరారు. తన ప్రతిభాపాటవాల కారణంగా చంద్రయాన్-3 మిషన్ లో కీలక సైంటిస్టుల బృందంలో ఒకరిగా కొనసాగుతున్నారు. 

ఎస్.స్టీఫెన్ చంద్రయాన్-3 ల్యాండర్ టీమ్ లో సభ్యుడు. స్టీఫెన్ స్వస్థలం విశాఖపట్నం షీలానగర్. తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులు కావడంతో బాల్యం నుంచే స్టీఫెన్ చదువులో ముందుండేవాడు. ఇస్రోలో రాకెట్ సైన్స్ ఇంజినీర్ గా చేరిన స్టీఫెన్ తన సామర్థ్యంతో చంద్రయాన్-3 బృందంలో పనిచేసేందుకు ఎంపికయ్యారు.
ISRO
Chandrayaan-3
Visakhapatnam District
Andhra Pradesh
India

More Telugu News