Raghuveera Reddy: మా ఊర్లో వ్యవసాయం చేసుకుంటున్న నాకు పార్టీ పెద్ద పదవి అప్పగించడం సంతోషంగా ఉంది: రఘువీరారెడ్డి

  • రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్ 
  • ఉనికి కోల్పోయిన నేతలు
  • సొంత ఊరికే పరిమితమైన రఘువీరా
  • తాజాగా సీడబ్ల్యూసీ సభ్యుడిగా నియామకం
  • పార్టీ కోసం ఇంకా శ్రమిస్తానని వెల్లడి
Raghuveera opines on being appointed as CWC member

యూపీఏ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించగా, ఆ నిర్ణయం ఏపీలో కాంగ్రెస్ ను భూస్థాపితం చేసింది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఏపీలో అడ్రస్ లేకుండా పోయింది. ఆ పార్టీ నేతలు కొందరు ఇతర పార్టీల్లోకి వెళ్లగా, కొందరు ఉన్నా లేనట్టుగానే ఉన్నారు. అలాంటివాళ్లలో మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఒకరు. 

ఆయన గత నాలుగేళ్లుగా స్వగ్రామం నీలకంఠాపురానికే పరిమితం అయ్యారు. అక్కడ ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలు పూర్తిచేసిన రఘువీరా... వ్యవసాయంలో తలమునకలయ్యారు. ఇప్పుడు హఠాత్తుగా ఆయనను కాంగ్రెస్ హైకమాండ్ సీడబ్ల్యూసీ సభ్యుడిగా నియమించింది. 

సీడబ్యూసీ అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ... పార్టీ పరంగా అత్యున్నత స్థాయిలో నిర్ణయాలు వెలువడేది ఈ సీడబ్ల్యూసీ నుంచే. అలాంటి కమిటీలో ఊహించని విధంగా తనకు స్థానం లభించేటప్పటికి రఘువీరా ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. దీనిపై ఆయన స్పందించారు. 

"నాలుగేళ్లుగా మా ఊర్లో వ్యవసాయం చేసుకుంటున్న నాకు పార్టీ పెద్ద పదవిని అప్పగించడం సంతోషంగా ఉంది. ఈ పదవి వస్తుందని నేను ఏమాత్రం ఊహించలేదు. నా రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశాను... ఇకపై నా సేవలను మరింత విస్తరిస్తాను. కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా కృషి చేస్తాను. ఈ క్రమంలో అందరినీ కలుపుకుని వెళతాను. కార్యకర్తల అభిప్రాయాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాను. మా గ్రామం నుంచే అధిష్ఠానానికి విలువైన సలహాలు, సూచనలు అందిస్తా... తద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పురోగతికి నా వంతు తోడ్పాటు అందిస్తా" అని వివరించారు.

More Telugu News