Dog: కుక్క పేరిట ఆస్తి రాసిన దంపతులు... జైలుపాలైన ప్రాపర్టీ ఏజెన్సీ నిర్వాహకుడు

Couple transferred assets to their dog and it leads property agency organizer arrest
  • ఇరాన్ లో కుక్కలను పెంచుకోవడంపై ఆంక్షలు!
  • అయినప్పటికీ ఓ కుక్కను పెంచుకున్న దంపతులు
  • దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఆ కుక్కనే కన్నబిడ్డగా చూసుకుంటున్న వైనం
  • కుక్క పేరిట ఆస్తి బదిలీ ప్రక్రియను పూర్తి చేయించిన ప్రాపర్టీ ఏజెన్సీ నిర్వాహకుడు
  • అరెస్ట్ చేసిన పోలీసులు
మానవుడికి అత్యంత మచ్చికైన జంతువు కుక్క. చాలామంది శునకాలను ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. వాటిని తమ కన్నబిడ్డల్లా చూసుకుంటారు. అయితే ఇరాన్ వంటి ఇస్లామిక్ ప్రాబల్య దేశంలో ఇలా చేయడం కుదరదు. 

కుక్కలను పెంచుకోవడాన్ని అక్కడి మతాధికారులు అనుమతించరు. కుక్కలను అపవిత్రమైన వాటిగా పరిగణిస్తారు. ఇరాన్ లో కుక్కలను పెంచడం అంటే దాదాపు పాపం చేయడమేనని భావిస్తారు. కుక్కలను పట్టుకెళ్లి జూ పార్కులు, ఎడారుల్లో వదిలిపెట్టాలనే చట్టాన్ని తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 

అలాంటి ఆంక్షలు ఉండే దేశంలో ఓ దంపతులు కుక్కను పెంచుకోవడమే కాదు, దాని పేరిట ఆస్తి కూడా రాశారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. 

సదరు దంపతులకు పిల్లలు లేరు. పెంచుకుంటున్న కుక్కనే తమ బిడ్డగా భావించారు. ఆ శునకం పేరు చెస్టర్. పిల్లలు లేకపోవడంతో తమ యావదాస్తిని చెస్టర్ పేరిట రాయాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారు ఓ ప్రాపర్టీ ఏజెన్సీ నిర్వాహకుడిని కలుసుకున్నారు. 

అతడు ఆ దంపతుల నిర్ణయానికి ఆమోదం తెలిపి, వారిని ఎంతగానో ప్రోత్సహించాడు. ఆస్తికి సంబంధించిన పత్రాలను సిద్ధం చేసి, వాటిపై పెంపుడు కుక్క చెస్టర్ కాలి ముద్రలను కూడా వేయించి ఆస్తి బదిలీ ప్రక్రియ పూర్తి చేశాడు. తద్వారా ఆ దంపతుల్లో కళ్లలో ఆనందం చూశాడు. 

అయితే, దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇంకేముంది, ఇరాన్ మతాధికారులు ఆ ప్రాపర్టీ ఏజెన్సీ నిర్వాహకుడిపై భగ్గుమన్నారు. నైతిక విలువల ఉల్లంఘనకు పాల్పడ్డాడంటూ ఆ నిర్వాహకుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. చట్టపరమైన అనుమతి లేకుండా ఆస్తిని కుక్క పేరిట బదలాయించడం నేరమని అతడిపై అభియోగాలు మోపారు.
Dog
Asset
Couple
Transfer
Iran
Property Agency Organizer

More Telugu News