Rahul Gandhi: మన భూభాగాన్ని చైనా లాక్కుందని లడఖ్ లోని ప్రతి ఒక్కరికీ తెలుసు!: రాహుల్ గాంధీ

  • లడఖ్ లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ  
  • మోటార్ సైకిల్‌పై లడఖ్ మొత్తాన్ని సందర్శించానని వెల్లడి 
  • అంగుళం భూమి పోలేదని ప్రధాని మోదీ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపణ
Everyone in Ladakh knows that China has taken our land Rahul Gandhi

భారత భూభాగాన్ని చైనా లాక్కుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుతం లడఖ్ పర్యటనలో ఉన్న యువనేత శుక్రవారం కార్గిల్‌లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ... చైనా మన భూభాగాన్ని లాక్కుందని ప్రతి ఒక్కరికీ తెలుసునని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం అంగుళం భూమి కూడా తీసుకోలేదని పూర్తిగా అబద్ధపు ప్రకటన చేస్తున్నారని ధ్వజమెత్తారు.

జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బుధవారం ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సంభాషించుకున్నారు. అనంతరం రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తొమ్మిది రోజుల లడఖ్ పర్యటనలో చివరి రోజైన శుక్రవారం బహిరంగ సభలో మాట్లాడారు.

తాను గత వారం రోజులుగా తన మోటార్ సైకిల్‌పై లడఖ్ మొత్తాన్ని సందర్శించానని, లడఖ్ ఒక వ్యూహాత్మక ప్రదేశమని రాహుల్ అన్నారు. తాను ప్యాంగోగ్ సరస్సు వద్ద ఉన్నప్పుడు, చైనా వేల కిలోమీటర్ల భారత భూమిని లాక్కున్నట్లు స్పష్టమైందని ఆయన చెప్పారు. దురదృష్టవశాత్తు, ప్రతిపక్ష సమావేశంలో ప్రధాని మోదీ మాత్రం మన భూమిలో ఒక్క అంగుళం కూడా చైనా తీసుకోలేదని ప్రకటన చేయడం పూర్తిగా అబద్ధమన్నారు. 

చైనా మన భూమిని లాక్కుందని లడఖ్‌లోని ప్రతి ఒక్కరికీ తెలుసునని, ప్రధాని నిజం మాట్లాడడం లేదని రాహుల్ ఆరోపించారు. తన లడఖ్ పర్యటనలో ఆయన చైనాతో సరిహద్దు సమస్యను లేవనెత్తడం ఇది రెండోసారి. లడఖ్‌లో ఒక్క అంగుళం భూమిని కూడా చైనా స్వాధీనం చేసుకోలేదని మోదీ చేసిన ప్రకటనలో వాస్తవం లేదని రాహుల్ గత ఆదివారం అన్నారు.

  • Loading...

More Telugu News