DR CR Rao: డాక్టర్ సీఆర్ రావు మృతి తీవ్ర విచారం కలిగించింది: చంద్రబాబు

Chandrababu condolences to the demise of  Dr CR Rao
  • గణిత, గణాంక శాస్త్ర దిగ్గజం డాక్టర్ సీఆర్ రావు కన్నుమూత
  • 102 ఏళ్ల వయసులో అమెరికాలో తుదిశ్వాస విడిచిన డాక్టర్ రావు
  • అత్యంత ప్రభావశీలి అంటూ కొనియాడిన చంద్రబాబు
  • డాక్టర్ రావు ఘనమైన వారసత్వం రాబోయే తరాలకు స్ఫూర్తినందిస్తుందని వెల్లడి

గణిత, గణాంక శాస్త్ర దిగ్గజం డాక్టర్ సీఆర్ రావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. 102 ఏళ్ల సీఆర్ రావు అమెరికాలో అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.

భారత్ కు చెందిన విఖ్యాత గణిత శాస్త్రవేత్త, ప్రముఖ గణాంక నిపుణుడు, తాను ఎంచుకున్న రంగాల్లో అత్యంత ప్రభావశీలిగా పేరుగించిన డాక్టర్ సీఆర్ రావు ఇక లేరన్న వార్త తీవ్ర విచారం కలిగించిందని తెలిపారు. 

ఓ తెలుగు కుటుంబంలో జన్మించిన సీఆర్ రావు ఎంతో విలువైన 70 ఏళ్లను తనకిష్టమైన రంగం కోసం అంకితం ఇచ్చారని చంద్రబాబు కొనియాడారు. గణిత, గణాంక శాస్త్రాలపైనా, ఆర్థిక శాస్త్రంపైనా ఆయన పరిశోధన ఎంతో గొప్ప ప్రభావం చూపిందని కీర్తించారు. 

జాతీయ నమూనా సేకరణ (నేషనల్ శాంపిల్ సర్వే-ఎన్ఎస్ఎస్) విధానానికి రూపకల్పన చేయడంలో డాక్టర్ రావు కీలక పాత్ర పోషించారని చంద్రబాబు వెల్లడించారు. భారత్ తో పాటు ఇతర దేశాలకు చెందిన తొలి తరం గణాంక నిపుణులకు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ (ఐఎస్ఐ)లో  శిక్షణ ఇవ్వడంలో ఆయన పాత్ర అమోఘం అని పేర్కొన్నారు. 

ఈ రంగంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్-2023 అవార్డు ప్రకటించారని తెలిపారు. డాక్టర్ సీఆర్ రావు ఘనతర వారసత్వం రాబోయే తరాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని వివరించారు.

  • Loading...

More Telugu News