Chandrayaan-3: భారత్‌కు ఏ దేశం సాయం చేయలేదు, చంద్రయాన్-3తో ఆ పరిస్థితిని మార్చేసింది: కస్తూరిరంగన్

We were denied access to tech says Kasturirangan
  • అనేక దేశాలు భారత్‌కు సాంకేతికతను అందించేందుకు నిరాకరించాయని వెల్లడి
  • వనరులులేక భారత్ వివిధ రంగాల్లో సాంకేతికత కోసం ఇతర దేశాలపై ఆధారపడిందని వెల్లడి
  • చంద్రయాన్-3తో ఈ రంగంలో భారత్ శక్తిసామర్థ్యాలను చాటి చెప్పామన్న కస్తూరి రంగన్

చంద్రయాన్-3 విజయంపై ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరిరంగన్ స్పందించారు. ఈ ప్రయోగం తర్వాత అంతరిక్ష పరిశోధనలకు అవసరమైన సాంకేతికత కోసం భారత్ ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని వెల్లడైందన్నారు. చంద్రయాన్-3ని విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధృవంపై దింపడం ద్వారా అంతరిక్ష సాంకేతికతలో భారత్ అగ్రగామిగా నిలిచిందన్నారు. గతంలో పలు దేశాలు భారత్‌కు అణు, అంతరిక్ష రంగాల్లో సాంకేతికతను అందించడానికి ముందుకు రాలేదన్నారు. కానీ తాజా ప్రయోగంతో ఇతర దేశాలు భారత్‌కు అవసరమైన సాయం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తాయన్నారు. ఈ ప్రయోగం ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి నిర్ణయాత్మక ప్రక్రియలలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

చంద్రుడిని చేరుకోవడం ద్వారా ఈ రంగంలో భారత్ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పామన్నారు. ఇది స్పేస్ టెక్నాలజీలో భారత్‌ను ముందంజలో ఉంచడమే కాకుండా భవిష్యత్తులో గ్రహాన్వేషణ, అక్కడి వనరుల వెలికితీతలో కీలక పాత్ర పోషించడానికి సాయపడుతుందన్నారు. గతంలో తగిన వనరులు లేక భారత్ అంతరిక్ష, అణుశక్తితో పాటు ఇతర రంగాల్లో సాంకేతికత కోసం ఇతర దేశాలపై ఆధారపడిందన్నారు. వివిధ సందర్భాల్లో సాయం అందించేందుకు ఆ దేశాలు నిరాకరించాయన్నారు. చంద్రయాన్-3 విజయం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసిందన్నారు. కస్తూరి రంగన్ 1994 నుండి 2003 వరకు ఇస్రో చైర్మన్‌గా ఉన్నారు.

  • Loading...

More Telugu News