Chiranjeevi: కొడాలి నాని కాళ్లు పట్టుకునే స్థాయికి వచ్చాడు: టీడీపీ నేత వెనిగండ్ల రాము

Kodali Nani realised the power of Chiranjeevi says Venigandla Ramu
  • సినీ ఇండస్ట్రీలోని పకోడీగాళ్లు అంటూ కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు
  • కొడాలిపై మండిపడుతున్న మెగా ఫ్యాన్స్
  • చిరంజీవిని ఉద్దేశించి తాను వ్యాఖ్యానించలేదన్న కొడాలి
  • చిరంజీవి పవర్ ఇప్పటికైనా అర్థమయిందా అని ఎద్దేవా చేసిన రాము
టాలీవుడ్ ఇండస్ట్రీలోని పకోడీగాళ్లు అంటూ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులకు సినిమాల గురించి ఎందుకని ప్రశ్నించిన మెగాస్టార్ చిరంజీవి... పోలవరం, ప్రత్యేకహోదా, రోడ్లు వంటి వాటిపై దృష్టి సారించాలని అధికార పార్టీ నేతలకు సూచించారు. ఈ క్రమంలో కొడాలి నాని స్పందిస్తూ తనదైన శైలిలో నోటీకి పని కల్పించారు. పకోడీగాళ్లు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 

ఈ నేపథ్యంలో నిన్న చిరంజీవి పుట్టినరోజును స్వయంగా కొడాలి నాని నిర్వహించారు. కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండస్ట్రీలో శిఖరాగ్రాన ఉన్న చిరంజీవిని విమర్శించేంత సంస్కార హీనుడిని కాదని చెప్పారు. తన వెంట ఉన్న వారిలో 60 శాతం మంది చిరంజీవి అభిమానులేనని అన్నారు. నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీగాళ్లకు కూడా చిరంజీవి సలహా ఇవ్వాలనే భావనతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. 

ఈ క్రమంలో కొడాలి నానిపై టీడీపీ నేత వెనిగండ్ల రాము పరోక్షంగా విమర్శలు గుప్పించారు. చిరంజీవి పవర్ ఏంటో ఇప్పటికైనా అర్థమయిందా అని ఎద్దేవా చేశారు. మెగాస్టార్ పవర్ ఏమిటనేది కొందరికి ఇప్పటికైనా అర్థమయినట్టుందని అన్నారు. చిరంజీవిపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన వారు ఆ తప్పు తెలుసుకుని లెంపలేసుకుంటున్నారని చెప్పారు. మెగాస్టార్ పై ఆ వ్యాఖ్యలు చేయలేదంటూ ఆయన కాళ్లు పట్టుకునే స్థాయికి వచ్చారని అన్నారు.
Chiranjeevi
Tollywood
Kodali Nani
YSRCP
Venigandla Ramu
Telugudesam

More Telugu News