BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ సంచలన నిర్ణయం

MLA Rekha Naik Applies for Congress Ticket From Khanapur
  • కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ టికెట్ కోసం దరఖాస్తు
  • మంగళవారం గాంధీ భవన్ లో దరఖాస్తు అందజేసిన ఎమ్మెల్యే పీఏ
  • బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో పార్టీ వీడాలని నిర్ణయం
బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ పార్టీ మారడం దాదాపుగా ఖరారైంది. అధికార పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్యే మంగళవారం కార్యకర్తలు, అనుచరుల వద్ద కన్నీటిపర్యంతమయ్యారు. ఎవరు మోసం చేసినా నియోజకవర్గ ప్రజలు తనను మోసం చేయరని, వారంతా తనవెంటే ఉంటారని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.

ఖానాపూర్ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకున్న ఎమ్మెల్యే రేఖానాయక్.. తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ దరఖాస్తును తన పీఏతో గాంధీభవన్ కు పంపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు.. సోమవారం సాయంత్రమే ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ తరఫున ఆసిఫాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి శ్యామ్ నాయక్ దరఖాస్తు చేసుకున్నారు.

కాగా, 2014 తోపాటు 2018లోనూ ఖానాపూర్ నుంచి బీఆర్ఎస్ టికెట్ పై రేఖానాయక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కిందటి అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తర్వాత ఎస్టీ కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆమె ఆశించారు. అయితే, మంత్రి పదవి దక్కకపోగా.. ఈసారి పార్టీ టికెట్ కూడా దక్కకపోవడంతో విస్మయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఖానాపూర్ లో తన సత్తా చూపిస్తానని, బీఆర్ఎస్ పై ప్రతీకారం తీర్చుకుంటానని రేఖానాయక్ శపథం చేశారు.
BRS
RekhaNaik
BRS Mla
Khanapur
Congress ticket
Rekha naik congress

More Telugu News