Luna-25: లూనా-25 వైఫల్యం తట్టుకోలేక ప్రముఖ రష్యా శాస్త్రవేత్తకు తీవ్ర అస్వస్థత

Top Russian Scientist Hospitalised Hours After Luna 25 Moon Mission Crash
  • లూనా-25 సహా అనేక రష్యా అంతరిక్ష ప్రయోగాలపై పని చేసిన మిఖెయిల్ మారోవ్(90)
  • తన జీవితకాల కృషికి లూనా-25 ప్రతీకగా భావించిన సీనియర్ శాస్త్రవేత్త
  • ల్యాండర్ కూలిపోవడంతో నిర్ఘాంతపోయిన వైనం, అక్కడికక్కడే కూలబడిపోయిన శాస్త్రవేత్త
  • ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైనం
  • రష్యా లూనార్ ప్రోగ్రామ్‌ పునరుద్ధరణకు చివరి ఆశ కూడా అంతరించిపోయిందని మిఖేయిల్ ఆవేదన
అంతరిక్ష రంగంలో పునర్వైభవాన్ని పొందాలన్న లక్ష్యంతో రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్ అనూహ్యంగా విఫలమైంది. కక్ష్య మార్పు సమయంలో అదుపుకోల్పోయిన ల్యాండర్ చంద్రుడిపై కూలిపోయింది. ఈ ఘటనతో నిర్ఘాంతపోయిన రష్యా శాస్త్రవేత్త మిఖేయిల్ మారోవ్ (90) తీవ్ర అవస్వస్థతకు లోనయ్యారు. లూనా-25 కూలిపోయిన కొద్ది సేపటికే షాక్ తిన్న ఆయన తానున్న చోటే కూలబడిపోయారు. దీంతో, వెంటనే ఆయనను అక్కడున్న వారు ఆసుపత్రికి తరలించారు. లూనా-25 ప్రయోగంలో మిఖెయిల్ కీలక పాత్ర పోషించారు. 

ఓ రష్యా వార్తా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మిఖెయిల్ మాట్లాడుతూ లూనా-25 వైఫల్యం పెద్ద ఎదురుదెబ్బ అని అభివర్ణించారు. ఈ వైఫల్యం తన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించిందన్నారు. ‘‘ఇలాంటిది జరిగినప్పుడు ఆందోళన చెందకుండా ఎలా ఉండగలం? ఇది నా జీవితానికి సంబంధించిన అంశం.. చాలా క్లిష్టమైన సమయం. ప్రస్తుతం నేను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాను’’ అని రష్యా రాజధానిలోని ఓ ఆసుపత్రిలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిఖెయిల్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రష్యాకు చెందిన అనేక అంతరిక్ష ప్రయోగాల్లో మిఖెయిల్ పాల్గొన్నారు. ఆయన జీవితకాల కృషికి రూపమే లూనా-25 మిషన్. 

‘‘ల్యాండర్‌ను జాబిల్లిపై దించలేకపోవడం ఎంతో విచారం కలిగించింది. రష్యా లూనార్ ప్రోగ్రామ్ పునరుద్ధరణపై మా చివరి ఆశలు ఆవిరైపోయాయి’’ అని మిఖేయిల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ వైఫల్యానికి గల కారణాలను నిశితంగా పరిశీలించి, విశ్లేషించాలని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించడంలో విఫలమైన లూనా-25 ఆ తరువాత జాబిల్లి ఉపరితలంపై కూలిపోయిందని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్‌కాస్మోస్ పేర్కొంది. ఘటనకు కారణాలను మాత్రం వెల్లడించలేదు.
Luna-25
Russia
Roscosmos
Chandrayaan-3

More Telugu News