Telugudesam: తెలంగాణలో ఒంటరిగా బరిలోకి టీడీపీ.. త్వరలోనే అభ్యర్థుల పేర్ల ప్రకటన

TDP will fight solo in Telangana assembly elections
  • తెలంగాణ టీడీపీ చీఫ్ కాసాని, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావులతో చంద్రబాబు భేటీ
  • కాసాని బస్సు యాత్ర, అభ్యర్థులు, రాష్ట్ర రాజకీయాలపై చర్చ
  • తెలంగాణలో టీడీపీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచన
  • తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడిగా కాపా కృష్ణమోహన్ ప్రమాణ స్వీకారం
తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా, మిగతా పార్టీలు కూడా అభ్యర్థుల కూర్పులో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో టీడీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ప్రకటించారు. ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. త్వరలోనే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని చెప్పారు.

హైదరాబాద్‌లోని తన నివాసంలో నిన్న తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాసాని బస్సు యాత్ర, అభ్యర్థులు, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించారు. తమ హయాంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్దిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాతే బస్సుయాత్రతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. కాగా, నిన్న తెలంగాణ తెలుగు రైతు విభాగం కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడిగా కాపా కృష్ణమోహన్ ప్రమాణస్వీకారం చేశారు.
Telugudesam
Telangana TDP
Chandrababu
Kasani Gnaneshwar Mudiraj

More Telugu News