Team India: రెండో టీ20లోనూ టీమిండియాదే విజయం... సిరీస్ సులభంగానే చిక్కింది!

Team India beat Ireland by 33 runs in 2nd T20I and grabbed the series
  • 33 పరుగుల తేడాతో నెగ్గిన భారత్
  • తొలుత 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసిన భారత్
  • లక్ష్యఛేదనలో 8 వికెట్లకు 152 పరుగులే చేసిన ఐర్లాండ్
  • సిరీస్ 2-0తో టీమిండియా కైవసం

ఐర్లాండ్ తో తొలి టీ20 మ్యాచ్ వర్షం వల్ల నిలిచిపోగా, డీఎల్ఎస్ ప్రకారం నెగ్గిన భారత్... రెండో టీ20లో మాత్రం సాధికారికంగా విజయం సాధించింది. డబ్లిన్ లోని ది విలేజ్ మైదానంలో  జరిగిన రెండో టీ20లో టీమిండియా 33 పరుగుల తేడాతో ఐర్లాండ్ ను ఓడించింది. 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బుమ్రా సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. అయితే, లక్ష్యఛేదనలో ఆతిథ్య ఐర్లాండ్ 20 ఓవర్లు ఆడి 8 వికెట్లకు 152 పరుగులే చేయగలిగింది. టీమిండియా బౌలర్లు సమష్టిగా కదం తొక్కడంతో  ఐర్లాండ్ ఆటలు సాగలేదు. కెప్టెన్ బుమ్రా 2, ప్రసిద్ధ్ కృష్ణ 2, రవి బిష్ణోయ్ 2, అర్షదీప్ సింగ్  1 వికెట్  తీశారు.

ఐర్లాండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ఆండ్రూ బాల్ బిర్నీ చేసిన 72 పరుగులకే అత్యధికం. ధాటిగా ఆడిన బాల్ బిర్నీ 51 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 4 సిక్సులు కొట్టాడు. అయితే, కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (0), లోర్కాన్ టకర్ (0) డకౌట్ కాగా, కీలక ఆటగాడు హ్యారీ టెక్టర్ (7) నిరాశపరిచాడు. 

కర్టిస్ కాంఫర్ 18, జార్జ్ డాక్రెల్ 13, మార్క్ అడౌర్ 23 పరుగులు చేయడంతో ఐర్లాండ్ స్కోరు 150 మార్కు చేరుకుంది. టీమిండియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఐర్లాండ్ సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. 

టీమిండియా ఈ విజయంతో 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో టీ20 మ్యాచ్ ఆగస్టు 23న జరగనుంది.

  • Loading...

More Telugu News