Rajinikanth: అఖిలేశ్ ను కలుసుకుని, అయోధ్య ప్రయాణమైన రజనీకాంత్

Rajinikanth meets Akhilesh Yadav after 9 years greets him with a hug
  • శనివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో భేటీ
  • ఆదివారం అఖిలేశ్ యాదవ్ తో సమావేశం
  • అఖిలేశ్ తన మిత్రుడని, ఇది మర్యాదపూర్వక భేటీయేనన్న రజీనీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ యూపీ పర్యటన సందడిగా, జోరుగా సాగుతోంది. నిన్న లక్నోలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలుసుకున్న రజనీకాంత్.. నేడు యూపీ ప్రతిపక్ష నేత, సమాజ్ వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తో భేటీ అయ్యారు. యోగి ఆదిత్యనాథ్ కు పాదాభివందనం చేసిన రజనీకాంత్.. అఖిలేశ్ యాదవ్ ను ఆలింగనం చేసుకున్నారు. రజనీకాంత్ వెంట ఆయన భార్య లత కూడా ఉన్నారు.  అఖిలేశ్ తండ్రి, సమాజ్ వాదీ పార్టీ దివంగత అధినేత ములాయం సింగ్ యాదవ్ చిత్ర పటం వద్ద రజనీకాంత్ నివాళులు అర్పించారు. 

‘‘ముంబైలో జరిగిన ఓ ఫంక్షన్ లో తొమ్మిదేళ్ల క్రితం అఖిలేశ్ యాదవ్ ను కలుసుకున్నాను. అప్పటి నుంచి మేము స్నేహితులం. ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఐదేళ్ల క్రితం నేను ఇక్కడకు షూటింగ్ కోసం వచ్చినప్పటికీ, కలుసుకోలేకపోయాను. అందుకని ఇప్పుడు కలిశాను’’అని రజనీ మీడియా ప్రతినిధులతో అన్నారు. అఖిలేశ్ తో సమావేశం ఎలా జరిగిందని ప్రశ్నించగా.. గొప్పగా జరిగిందని బదులిచ్చారు. ఇది మార్యాదపూర్వక భేటీయేనని, అఖిలేశ్ తన మిత్రుడని రజనీ పేర్కొన్నారు. తాను ఆదివారం లక్నో నుంచి అయోధ్య రాముడి దర్శనం కోసం వెళుతున్నట్టు తెలిపారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిని కూడా కలుస్తున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. నవ్వుతూ నో అని చెప్పారు.
Rajinikanth
tamil super star
met
Akhilesh Yadav

More Telugu News