P.Chidambaram: హిందీ పేర్లను ఇంగ్లిష్‌లో పెట్టారు.. క్రిమినల్ చట్ట పునరుద్ధరణ బిల్లుపై చిదంబరం వ్యంగ్యం

Hindi names drafted in English Chidambaram on Centres criminal law revamp bills
  • హిందీపేర్ల వెనక హేతుబద్ధతను ప్రశ్నించిన పి.చిదంబరం
  • బిల్లులను ఇంగ్లిష్‌లో రూపొందించి హిందీ పేర్లు పెట్టడం ఏంటని ప్రశ్న
  • ఆ పేర్లను ఉచ్ఛరించడం కూడా కష్టమేనన్న కాంగ్రెస్ నేత
న్యాయవ్యవస్థను సవరించేందుకు లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై కేంద్ర మాజీమంత్రి పి.చిదంబరం తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులకు హిందీ పేర్లు పెట్టడం వెనక హేతుబద్ధత ఏంటని ప్రశ్నించారు. తమిళనాడులోని పుదుకొట్టైలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈ బిల్లులకు హిందీ పేర్లు పెట్టకూడదని తాను చెప్పడం లేదని, ఇంగ్లిష్ ఉపయోగించినప్పుడు ఆ పేరు కూడా ఇంగ్లిష్‌దే అయి ఉండాలని అభిప్రాయపడ్డారు. హిందీని ఉపయోగించినప్పుడు మాత్రమే హిందీ పేరు ఉండాలని పేర్కొన్నారు. చట్టాలను రూపొందించినప్పుడు దానిని ఇంగ్లిష్‌లో చేస్తారని, తర్వాత దానిని హిందీలోకి అనువదిస్తారని పేర్కొన్నారు. కానీ వారు చట్టాలు, నిబంధనలను ఇంగ్లిష్‌లో రూపొందించారని, దానికి హిందీ పేరు పెట్టారని విమర్శించారు. దీనిని ఉచ్ఛరించడం కూడా కష్టమేనని అన్నారు. 

కేంద్రం ప్రవేశపెట్టిన ఈ మూడు బిల్లులకు ‘భారతీయ న్యాయ సంహిత’, ‘భారతీయ నాగరిక్ సురక్ష సంహిత’, ‘భారతీయ సాక్ష్య బిల్’ అని పేర్లు పెట్టింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘ఇండియన్ పీనల్ కోడ్’, ‘కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసిడ్యూర్’, ‘ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్’ల పేర్లను మారుస్తూ కేంద్రం వీటిని ప్రతిపాదించింది.
P.Chidambaram
Congress
Criminal Law

More Telugu News