Kota Students: పిల్లల ఆత్మహత్యలకు మీరే కారణం.. కోచింగ్ సెంటర్లు, తల్లిదండ్రులపై రాజస్థాన్ సీఎం ఫైర్

Ashok Gehlot orders panel and blames coaching centres and parents
  • కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై కమిటీ వేసిన రాజస్థాన్ ప్రభుత్వం
  • 15 రోజుల్లో నివేదిక ఇవ్వనున్న కమిటీ
  • 9, 10 తరగతుల పిల్లల్ని జాయిన్ చేసుకుంటూ కోచింగ్ సెంటర్లు  నేరాలకు పాల్పడుతున్నాయన్న సీఎం
  • ఒక్క విద్యార్థి చనిపోయినా ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగుల్తుందన్న ముఖ్యమంత్రి
  • 2021లో 13 వేల మంది విద్యార్థుల ఆత్మహత్య

రాజస్థాన్‌లోని కోటాలో జరుగుతున్న ఐఐటీ, నీట్ అభ్యర్థుల ఆత్మహత్యలపై అశోక్‌ గెహ్లాట్ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టిసారించింది. విద్యార్థుల ఆత్మహత్యలను నివారించేందుకు, అవసరమైన సలహాలు ఇచ్చేందుకు నిన్న ఓ నిపుణుల కమిటీ వేసింది. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక సమర్పించనుంది. ఈ మేరకు సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు.  కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో నిన్న నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. 9, 10 తరగతులు చదువుతున్నప్పుడే విద్యార్థులపై విపరీతమైన భారం మోపుతున్నారని అన్నారు. 

‘‘9, 10 తరగతులు చదువుతున్న పిల్లల్ని జాయిన్ చేసుకుంటూ కోచింగ్ సెంటర్లు నేరానికి పాల్పడుతున్నాయి. ఇందులో తల్లిదండ్రుల తప్పు కూడా వుంది. ఓవైపు బోర్డు ఎగ్జామ్స్ కోసం చదువుతూనే, ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమవుతూ తీరని ఒత్తిడి అనుభవిస్తున్నారు" అన్నారు. ఇకపై, విద్యార్థుల ఆత్మహత్యలు చూడాలనుకోవడం లేదని, ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని అన్నారు. ఒక్క విద్యార్థి చనిపోయినా తల్లిదండ్రులకు తీరని వేదన మిగుల్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

విద్యార్థుల మరణాలపై జాతీయ నేర గణాంక బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన నివేదికపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం.. 2021లో దాదాపు 13 వేల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1,834 మంది ప్రాణాలు తీసుకోగా, మధ్యప్రదేశ్‌లో 1,308 మంది, తమిళనాడులో 1,246, కర్ణాటకలో 855, ఒడిశాలో 834 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.

  • Loading...

More Telugu News