Rinku Singh: జీవితంలో తొలిసారి బిజినెస్ క్లాస్ విమానంలో ప్రయాణం.. పట్టరాని సంతోషంలో ఐపీఎల్ స్టార్!

Rinku Singh Flies Business Class For 1st Time On Way To Ireland
  • కేకేఆర్ తరఫున గత ఐపీఎల్ లో సత్తా చాటిన రింకూ సింగ్
  • ఐర్లాండ్ తో టీ20 సిరీస్ కోసం భారత జట్టుకు ఎంపికైన యువ క్రికెటర్
  • ఈ రోజు ఐర్లాండ్ తో తొలి టీ20 ఆడనున్న టీమిండియా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ స్వరూపాన్ని మార్చేసింది. బీసీసీఐని ప్రపంచంలోనే సంపన్న క్రికెట్ బోర్డుగా చేసింది. దేశంలో ఎంతో మంది ప్రతిభావంతులకు అవకాశం కల్పించి.. వారి జీవితాలను మార్చేసింది. అలాంటి వారిలో ఐపీఎల్ 16వ సీజ‌న్ హీరో రింకూ సింగ్ ఒకడు. నిరుపేద కుటుంబంలో పుట్టి క్రికెట‌ర్‌గా ఎదిగే క్ర‌మంలో ఎన్నో క‌ష్టాలు అనుభ‌వించిన రింకూ సింగ్ ఐపీఎల్ లో సత్తా చాటడంతో అతని కష్టాలన్నీ తీరాయి. ఐపీఎల్ మెరుపులతో అతను భారత జట్టులో కూడా చోటు సాధించాడు. ఈ రోజు ఐర్లాండ్ తో జరిగే తొలి టీ20లో అతను అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం కూడా ఉంది. ఈ టూర్ కోసం ఐర్లాండ్ వెళ్లేందుకు రింకూ సింగ్ తన జీవితంలో తొలిసారి బిజినెస్ క్లాస్ విమానంలో ప్రయాణించాడు. 

అటు భారత జట్టులోకి రావడం, ఇటు తొలి బిజినెస్ క్లాస్ ప్రయాణంతో అతని ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయింది.. త‌న మొద‌టి బిజినెస్ క్లాస్ ప్రయణ అనుభ‌వాన్ని రింకూ సహచర క్రికెటర్ జితేశ్ శ‌ర్మ‌ తో పంచుకున్నాడు. రింకూను జితేశ్ ఇంటర్వ్యూ చేసిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ‘నాకు చాలా ఆనందంగా ఉంది. టీమిండియాకు ఆడాల‌నేది ప్ర‌తి క్రికెట‌ర్ క‌ల‌. ఇప్పుడు నా కల నెరవేరుతోంది. నా గదిలోకి  వెళ్లి నా పేరుతో ఉన్న‌ (35వ నంబర్) జెర్సీ చూసి ఎంతో భావోద్వేగానికి లోన‌య్యా. ఈ రోజు కోస‌మే నేను ఎంతో క‌ష్ట‌ప‌డ్డాను’ అని అన్నాడు. కాగా, ఐర్లాండ్ తో జరిగే మూడు టీ20ల సిరీస్ లో భారత జట్టుకు బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
Rinku Singh
Team India
ipl
Business Class
Ireland

More Telugu News