Jagga Reddy: తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డిని చేర్చుకోవద్దంటూ హరీశ్ రావుకు బీఆర్ఎస్ శ్రేణుల విన్నపం

Chinta Prabhakar followers requests Harish Rao to not to join Jagga Reddy into BRS
  • జగ్గారెడ్డి బీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం
  • జగ్గారెడ్డిని చేర్చుకోవద్దని హరీశ్ ను కోరిన చింతా ప్రభాకర్ అనుచరులు
  • జగ్గారెడ్డిని చేర్చుకుంటే పార్టీ నష్టపోతుందని చెప్పిన వైనం
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిది ఒక ప్రత్యేకమైన స్థానం. ముక్కుసూటిగా ఆయన మాట్లాడే మాటలు అందరినీ ఆకట్టుకుంటుంటాయి. తాజాగా ఆయన గురించి ఒక ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. బీఆర్ఎస్ లోకి జగ్గారెడ్డి జంప్ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో జగ్గారెడ్డి చేరికను ఆ పార్టీలోని అసంతృప్తులు వ్యతిరేకిస్తున్నారు. మంత్రి హరీశ్ రావును హైదరాబాద్ లోని ఆయన నివాసంలో సుమారు 200 మంది బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కలిశారు. జగ్గారెడ్డి తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేశారని, బోగస్ హామీలు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలుపొందారని, నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని హరీశ్ కు చెప్పారు. 

గత నాలుగున్నరేళ్లలో ఏనాడూ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలను జగ్గారెడ్డి పట్టించుకోలేదని హరీశ్ కు తెలిపారు. జగ్గారెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటే పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్ ను మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కే ఇవ్వాలని, జగ్గారెడ్డికి ఇవ్వొద్దని కోరారు. గత ఎన్నికల్లో చింతా ప్రభాకర్ ఓడిపోయినప్పటికీ... ప్రజల్లోనే ఉంటూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, ప్రజల మనిషిగా గుర్తింపు పొందారని తెలిపారు. ప్రభాకర్ కే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని, ఆయనను తాము గెలిపించుకుంటామని చెప్పారు.
Jagga Reddy
Congress
Harish Rao
BRS

More Telugu News