Dogs Fight: పోట్లాడుకున్న కుక్కలు.. ఇద్దరు వ్యక్తుల కాల్చివేత

2 dead as pet dogs fight leads to scuffle between neighbours
  • మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘటన
  • ఇంట్లోంచి తుపాకి తీసుకొచ్చి కాల్పులు జరిపిన శునకం యజమాని
  • మరో ఆరుగురికి తీవ్ర గాయాలు
రెండు పెంపుడు శునకాల మధ్య పోట్లాట ఇద్దరి హత్యకు కారణమైంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిందీ ఘటన. ఓ ప్రైవేటు బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రాజ్‌పాల్ రావత్ పెంచుకుంటున్న శునకం, పొరుగింటి వ్యక్తి పెంపుడు శునకం పోట్లాటకు దిగాయి. ఇది వారి మధ్య ఘర్షణకు కారణమైంది. ఇద్దరూ వాదులాటకు దిగారు. 

వారి మధ్య గొడవ చూసి చుట్టుపక్కల వారు గుమికూడారు. ఈ క్రమంలో కోపం పట్టలేని రావత్ ఇంట్లోంచి తుపాకి తీసుకొచ్చి అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించాడు. తూటాలు దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడు కాల్పులు జరుపుతున్న వీడియో వైరల్ అయింది.

మృతులను రాహుల్ (28), విమల్ (35)గా గుర్తించారు. గాయపడిన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిందితుడు రాజ్‌పాల్ రావత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి తుపాకిని స్వాధీనం చేసుకున్నారు.
Dogs Fight
Madhya Pradesh
Indore

More Telugu News