LB Nagar Police Station: హైదరాబాద్‌లో పోలీసుల ప్రతాపం.. అర్ధరాత్రి మహిళను స్టేషన్‌కు తీసుకొచ్చి లాఠీలతో కుళ్లబొడిచిన వైనం!

  • ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఘటన
  • రోడ్డుపై కనిపించిన మహిళలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన పెట్రోలింగ్ పోలీసులు
  • ఎందుకు తీసుకొచ్చారన్న ప్రశ్నకు రెచ్చిపోయి లాఠీలతో దాడి
  • నడవలేని స్థితిలో బాధిత మహిళ
  • మహిళా, పురుష కానిస్టేబుళ్ల సస్పెన్షన్
  • దాడిచేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశం
LB Nagar Police Beaten Woman Mercilessly

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళపై ఇద్దరు పోలీసులు వ్యవహించిన తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అర్ధరాత్రి వేళ పోలీస్ స్టేషన్‌కు మహిళలను తీసుకొచ్చిన పోలీసులు ఓ మహిళను లాఠీలతో కుళ్లబొడిచారు. దేశం మొత్తం స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్న ఆగస్టు 15న అర్ధరాత్రి ఈ ఘటన జరగడం గమనార్హం. నిన్న ఈ విషయం వెలుగులోకి రావడంతో దాడికి పాల్పడిన హెడ్‌కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆరోజు రాత్రి 11 గంటల సమయంలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులకు ఎల్బీనగర్ చౌరస్తాలో ముగ్గురు మహిళలు కనిపించారు. న్యూసెన్స్ చేస్తున్నారంటూ వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి సెక్షన్ 290 కింద కేసు నమోదు చేశారు. తమను స్టేషన్‌కు ఎందుకు తీసుకొచ్చారని, కేసు ఎందుకు పెడుతున్నారని మీర్‌పేటకు చెందిన మహిళ పోలీసులను ప్రశ్నించింది. దీంతో రెచ్చిపోయిన హెడ్‌కానిస్టేబుళ్లు శివశంకర్, సుమలత లాఠీలకు పనిచెప్పారు. విచక్షణ రహితంగా దాడిచేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఎడమ మోకాలి భాగం దెబ్బతింది. అరికాళ్లపైనా కొట్టడంతో నడవలేకపోయింది. రాత్రంతా ఆమెను స్టేషన్‌లోనే ఉంచిన పోలీసులు ఉదయం ఇంటికి పంపారు. విషయం బయటకు రావడంతో కానిస్టేబుళ్లు ఇద్దరినీ పోలీసులు సస్పెండ్ చేస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. 

మరోవైపు, బాధిత మహిళ కుటుంబ సభ్యులు నిన్న ఉదయం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళకు దిగారు. అయితే, అప్పటికే కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్టు తెలియడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై స్పందించిన మంత్రి సత్యవతి రాథోడ్.. మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ చౌహాన్‌ను ఆదేశించారు. కాగా, తన కుమార్తె వివాహం కోసం డబ్బులు తీసుకుని వెళ్తుండగా ఎల్బీనగర్ పోలీసులు అకారణంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టారని, తన వద్దనున్న రూ. 3 లక్షలు లాక్కున్నారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

More Telugu News