USA: తుపాకీ చేతపట్టి అమెరికా వీధుల్లో యువతి లొల్లి.. వీడియో ఇదిగో

woman was waving a gun when Nassau County police took the person down
  • న్యూయార్క్‌లో నసౌ కౌంటీలో మంగళవారం ఘటన
  • నాలుగు రోడ్ల కూడలిలో తుపాకీతో యువతి హల్‌చల్
  • గన్నును ఇతరులకు గురిపెట్టి ఆందోళన రేకెత్తించిన యువతి
  • నిందితురాలిని జాగ్రత్తగా కారుతో ఢీకొట్టి కిందపడేలా చేసి, అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఘటన తాలూకు వీడియో నెట్టింట్లో వైరల్
అమెరికాలో ఓ యువతి నాలుగు రోడ్ల కూడలిలో తుపాకీ చేతపట్టి తిరుగుతూ కలకలం సృష్టించింది. వీధిలోని వారిపై తొలుత తుపాకీ గురిపెట్టి, ఆపై తన తలవైపు గురిపెట్టుకుని భయాందోళనలు రేకెత్తించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి యువతిని అదుపులోకి తీసుకున్నారు. న్యూయార్క్‌లోని నసౌ కౌంటీలో ఈ ఘటన వెలుగు చూసింది. 

కౌంటీలోని నార్త్‌బెల్మూర్‌లోని ఓ కూడలి వద్ద మంగళవారం మధ్యాహ్నం నిందితురాలు తుపాకీ చేతపట్టి అటూ ఇటూ తిరుగుతూ కలకలం రేపింది. గాల్లోకి కాల్పులు కూడా జరిపింది. కాసేపు ఇతరులవైపు తుపాకీ గురిపెట్టిన యువతి ఆ తరువాత తన తలవైపు తుపాకీని గురిపెట్టుకుంది. అక్కడున్నవారు యువతి ఏ క్షణాన ఏం చేస్తుందో తెలీక కంగారు పడిపోయారు. 

ఆ సమయంలో పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి యువతిని అరెస్టు చేశారు. తొలుత వారు ఆమెను తమ కారుతో జాగ్రత్తగా ఢీకొట్టి కింద పడిపోయేలా చేశారు. కిందపడ్డ యువతి తేరుకునే లోపే ఆమెను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఓ ప్రత్యక్ష సాక్షి ఇదంతా రికార్డు చేసి నెట్టింట పెట్టడంతో వీడియో వైరల్‌గా మారింది. ఇలాంటి దృశ్యాన్ని తాను ఎన్నడూ చూడలేదని ఆ వ్యక్తి కామెంట్ చేశాడు. 

కాగా, నిందితురాలికి స్వల్ప గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.
USA
Crime News
Newyork

More Telugu News