ISRO: చంద్రయాన్-3 లో కీలక ఘట్టం.. చివరి కక్ష్యలోకి చేరిన స్పేస్ క్రాఫ్ట్

  • బుధవారం ఉదయం మరోమారు కక్ష్య తగ్గించిన ఇస్రో
  • గురువారం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోనున్న ల్యాండర్
  • ఈ నెల 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్
Last orbit redusing manoeuvre successfully performed says ISRO

చంద్రుడిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం బుధవారం నాడు పూర్తయింది. స్పేస్ క్రాఫ్ట్ కక్ష్య తగ్గింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో స్పేస్ క్రాఫ్ట్ కక్ష్య తగ్గింపు ప్రక్రియలన్నీ ముగిసాయని, చంద్రుడిపై తిరిగేందుకు ఇదే చివరి కక్ష్య అని పేర్కొన్నారు. ప్రస్తుతం చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి ఉపరితలానికి 153 కి.మీ. × 163 కి.మీ. దూరంలో తిరుగుతోందని వివరించారు.

గురువారం ఉదయం ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ల్యాండర్ మాడ్యుల్ విడిపోయే ప్రాసెస్ చేపడతామని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇకపై ల్యాండర్ మాడ్యుల్ (ల్యాండర్, రోవర్) సొంతంగా చంద్రుడి చుట్టూ చక్కర్లు కొడుతూ క్రమంగా కిందకు దిగుతుందని పేర్కొన్నారు. అంతా సాఫీగా జరిగితే ఈ నెల 23న ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుందని తెలిపారు.

More Telugu News