Royal Enfield: వచ్చేస్తోంది.. రాయల్ ఎన్ ఫీల్డ్ కొత్త బుల్లెట్

2023 Royal Enfield Bullet 350 to be launched on September 1
  • సెప్టెంబర్ 1న విడుదలకు రంగం సిద్ధం
  • సంప్రదాయ బుల్లెట్ డిజైన్ తోనే రానున్న బైక్
  • ధర ఎంత నిర్ణయిస్తుందన్న దానిపై ఆసక్తి
ప్రీమియం బైకుల కంపెనీ రాయల్ ఎన్ ఫీల్డ్ నూతన తరం బుల్లెట్ 350ని విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 1న బుల్లెట్ 350 మోడల్ ను ఆవిష్కరించనుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న క్లాసిక్ 350, హంటర్ 350 మోడళ్లకు మధ్యస్థంగా కొత్త మోడల్ ఉండనుంది. ప్రస్తుతం రాయల్ ఎన్ ఫీల్డ్ నుంచి అత్యంత చౌక బైక్ అంటే హంటర్ 350 అని చెప్పుకోవాలి. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1.5 లక్షలుగా ఉంది. 

రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ 350 మోడల్ డిజైన్ లో పెద్దగా మార్పులు చేయలేదు. సంప్రదాయ బుల్లెట్ మాదిరే నూతన మోడల్ కూడా ఉంటుంది. బాడీ ప్యానెల్స్ కొత్తగా కనిపించనున్నాయి. పొడవుగా ఒకటే సీటు ఉంటుంది. ముందు భాగంలో గుండ్రటి హాలోజెన్ హెడ్ ల్యాంప్ ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 41 ఎంఎం టెలీస్కోపిక్ ఫోర్క్ లు, వెనుక భాగంలో 6 స్టెప్స్ అడ్జస్ట్ చేసుకో తగిన ట్విన్ షాకబ్జార్బర్లు ఉంటాయి. 

ఇందులో జే సిరీస్ ఇంజన్ ను వినియోగించారు. ఎయిర్ ఆయిల్డ్ కూల్ టెక్నాలజీతో ఉంటుంది. గరిష్ఠంగా 20 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. 27ఎన్ఎం టార్క్ విడుదల అవుతుంది. ఇందులో ఐదు గేర్లు ఉంటాయి. హంటర్ 350, క్లాసిక్ 350 ఇంజన్ ఇందులోనూ ఉంటుంది. కాకపోతే ట్యూనింగ్ లో మార్పులు చేయొచ్చు. హంటర్ కంటే తక్కువ ధర నిర్ణయిస్తుందా? లేక అదే స్థాయిలో ఉంటుందా? అన్నది చూడాలి.
Royal Enfield
Bullet 350
2023 version
release

More Telugu News